
రామయ్యపల్లి అనే గ్రామంలో రంగయ్య, రంగమ్మ అనే దంపతులు ఉన్నారు. వారిది చాలా పేద కుటుంబం. వాళ్లకు రాము అనే పిల్లవాడు ఉన్నాడు. రాముకు చదువు అంటే చాలా ఇష్టం. కానీ వారికి డబ్బులు లేకపోవడం వలన రాము వాళ్ళ నాన్న తనతో పాటు రామును కూడా కూలి పనికి తీసుకు వెళ్ళేవాడు. అక్కడ పక్కనే ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. సమయం దొరికినప్పుడల్లా రాము ఆ పాఠశాల కిటికీ వద్దకు వెళ్లి గురువులు చెప్పేది చాటుగా వినేవాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు రాము పనిచేస్తూ ఒక పద్యం పాడాడు. పాఠశాలకు వెళ్తున్న తెలుగు మాస్టారు అది విన్నాడు. ఆయన, రాము దగ్గరకు వెళ్లి 'పద్యం ఇంత బాగా చదివావు. ఎక్కడ నేర్చుకున్నావు' అని అడిగాడు. దానికి రాము 'మీరు చెపుతుండగా కిటికీలో నుండి విని నేర్చుకున్నాను' అన్నాడు. 'అదేంటి.. నువ్వు బడికి రాకుండా ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నావు? అని మాస్టారు రాముని అడిగాడు. అంతటితో ఆగకుండా రాము వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి 'మీ కొడుకుకి చదువుకోవాలని చాలా ఆసక్తి ఉంది. బాగా చదివి నీకు మంచి పేరు తెస్తాడు. బడికి పంపు' అన్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఎలాంటి ఖర్చు ఉండదని కూడా చెప్పాడు. దానితో రంగయ్య కొడుకుని బడికి పంపించాడు. ఉపాధ్యాయుడు చెప్పినట్టుగా విని, రాము బాగా చదివి ఉద్యోగం తెచ్చుకున్నాడు. అప్పుడు రాము వాళ్ళ అమ్మానాన్న ఎంతో సంతోషించారు.
- రెడపాక అగ్రజ్,
8వ తరగతి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
నర్సింహుల పల్లి, పెద్దపల్లి జిల్లా.