- సామర్లకోట రోడ్ కెనాల్ ఆక్రమణలు, ఉప్పుటేరు ముంపు అరికట్టాలి
- ఎపి సిఎం పర్యటన సందర్భంగా సామర్లకోట రోడ్ లో ఫ్లెక్సీ ప్రదర్శన చేపట్టిన సామాజికవేత్త
ప్రజాశక్తి-కాకినాడ : బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా సామర్లకోట వస్తున్న సందర్భంగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కాకినాడ సామర్లకోట రోడ్ లో ఫ్లెక్సీ ప్రదర్శన నిర్వహించారు. సామర్లకోట రోడ్డుకిరు వైపులా కెనాల్స్ పొడవునా ఏర్పడిన భారీ ఆక్రమణలు ఉప్పుటేరు నడుమ మేడలైన్ అక్రమవంతెన సముద్ర పాయలోకి చేరే కాలువ కుచించుకు పోవడం వలన ఎగువ నుండి వస్తున్న గోదావరి వరదల్లో జిల్లా కేంద్రం తీవ్ర ముంపుకు గురై 16 డివిజన్లు 8గ్రామాలు వేల ఎకరాల పంట చేను జల దిగ్బంధనం అవుతున్నాయన్నారు. రెండేళ్ల క్రిందట రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించినా స్థానిక పౌరులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు వహించడం లేదన్నారు. జిల్లా కేంద్రం అభివృద్ధికి పౌర సౌకర్యాల పెంపుకు నగరపాలక సంస్థ ఆదాయ ప్రగతికి తావులేకుండా రు.1,000 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు తీవ్ర దుర్వినియోగ మయ్యాయన్నారు. ఇదే తీరుగా మురుగు నీరు పారించే ప్రణాళిక లేకుండా జనరల్ నిధులు వృధా చేసి బాగున్న సిసి రోడ్లు మరింత ఎత్తు చేయడం వలన ఇళ్ళు లోగిళ్ళు పల్లమై మురుగు జలమయమవుతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం అయ్యాయని తాను అధికారంలోకి వస్తే వాటిపై విచారణ చేయిస్తానని 2019లో ఎన్నికల హామీ ప్రకటించిన సిటీ ఎమ్మెల్యే ఎటువంటి చర్యలు వహించక పోగా మరింత దుర్వినియోగానికి వారి వైఖరే కారక మయ్యిందని రమణ రాజు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో పనిచేసిన అధికారులు అవినీతి హవాలాలో కోట్లు సంపాదించుకున్నారని విజిలెన్స్ దర్యాప్తు, ఎసిబి దాడులు లేకుండా అక్రమార్జనకు రాజ మార్గంగా కార్పోరేషన్ పాలన గాడి తప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు వహించి నగర పాలక సంస్థలో పాతుకు పోయిన దుర్వినియోగం అవినీతి అక్రమాలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని కోరారు. ఎపి ప్రభుత్వ భవనాల ఆస్తిపన్ను కుళాయి పన్ను బకాయిలు అపరాధ రుసుములతో రు.50 కోట్ల మేరకు పెండింగ్ వున్నందున 2023-24 బడ్జెట్ లో ఆయా శాఖల పద్దుల నుండి విడుదల చేయించాలన్నారు. ప్రభుత్వ శాఖలకు స్థానిక ఖజానా నుండి మళ్లించిన సాధారణ నిధులు రూ.20కోట్లు జమ చేయించే చర్యలు వహించాలన్నారు. జిల్లా కేంద్రం ప్రగతికి పరిసర గ్రామాల విలీనం కేసులు తొలగించి గ్రేటర్ కాకినాడ గా అప్ గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు.










