Oct 07,2023 06:39

భారత్‌లో కనీసం రూ.8 వేల కోట్ల పైబడి సంపద కలిగివున్నవారి సంఖ్య 169కి పెరిగినట్లు అమెరికా మ్యాగజిజైన్‌ ఫోర్బ్స్‌ గురువారం నాడు వెల్లడించింది. గతేడాది 166 మంది బిలియనీర్లు ఉండగా వారి సరసన మరో ముగ్గురు చేరారు. ప్రపంచం ఆర్థిక సంక్షోభాలతో సతమతమవుతున్న సమయంలో ముంచుకొచ్చిన కోవిడ్‌ విపత్తు ప్రజలను కష్టాల కడలిలోకి నెట్టేసింది. ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న ధరాఘాతాలకు బలైపోయి ప్రజల ఆదాయాలు అంతకంతకూ క్షీణించిపోతుంటే కుబేరుల సంపదతో పాటు సంఖ్య కూడా పెరగడం అసమానతల తీవ్రతకు అద్దం పడుతోంది. చమురు, టెలికాం వంటి పరిశ్రమల్లోనే కాకుండా చిల్లర వ్యాపారాలను సైతం ఛిద్రం చేసి సర్వం తానే విక్రయించి లాభాలను టోకుగా ఆర్జిస్తున్న రిలయన్స్‌ గ్రూపు అధినేత ఈ ఏడాది ఫోర్బ్స్‌ జాబితాలో రూ.ఏడున్నర లక్షల కోట్ల సంపదతో దేశంలో అగ్రస్థానంలోనూ, ప్రపంచంలో 11వ స్థానంలోనూ నిలిచారు. ఆ తర్వాత స్థానంలో బిజెపికి ఆప్తుడైన గౌతం అదానీ రూ.నాలుగున్నర లక్షల కోట్ల సంపదతో ప్రపంచ ర్యాంకింగ్‌లో 23వ స్థానాన్ని దక్కించుకున్నారు. అదానీ గ్రూపు సంస్థల అక్రమాలను హిండెన్‌బర్గ్‌ నివేదిక బహిర్గతం చేసిన నేపథ్యంలో ఆయన సంపద క్షీణించినట్లు కనపడినా..ఇప్పటికీ దేశ సంపన్నుల జాబితాలో ఆయనదే రెండోస్థానం. టెస్లా, ట్విట్టర్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ 240.7 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలోనే అగ్రగామిగా రికార్డుకెక్కారు. ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాల్లో చోటు దక్కించుకోవడమంటే ఆ మేరకు ప్రజల సంపదను దోపిడి చేయడమేనన్న ప్రగతిశీల ఆర్థిక వేత్తల విశ్లేషణలు అర్థమంతమైనవి. కోవిడ్‌ లాంటి విపత్తు సమయంలోనూ శతాధిక కోట్లు ఆర్జిస్తున్నవారి సంపద పెరిగిపోతుండటమే దీనికి నిదర్శనం. ఒకే సమయంలో పేదలు ధరా భారాలతో, కష్టాల కడగండ్లతో కకావికలమవుతుంటే సంపన్నుల ఆస్తులు మాత్రం కొండల్లా పేరుకుపోవడానికి కారణం పాలకులు అమల్జేస్తున్న వినాశకర విధానాలే.
మనదేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆర్థిక అసమానతలు గతంలో కంటే మరింతగా పెరుగుతూ వస్తున్న సంగతి విదితమే. నింగి, నేలా తేడా లేకుండా సర్వ సంపదలనూ కార్పొరేట్‌ కంపెనీలకు దోచి పెడుతుండటంతో కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో సంపద కేంద్రీకృతమవుతోంది. భారతదేశ మొత్తం సంపదలో 40 శాతం కంటే అధిక సంపద కేవలం 1 శాతం జనాభాకు సమానమైన కుబేరుల ఇళ్లలో మూలుగుతోందని ఈ ఏడాది ప్రారంభంలోనే ఆక్స్‌ఫామ్‌ సంస్థ నివేదించింది. ఈ శతకోటీశ్వర్లు కంటే వస్తువులు, సేవల కోసం పేద ప్రజలే అధికమొత్తంలో పన్నులు చెల్లిస్తున్నారని ఆ సంస్థ కుండబద్దలు కొట్టింది. పేదరికంలోని 50 శాతం మంది దగ్గర కలిపి..మొత్తం సంపదలో కేవలం 3 శాతమే ఉందంటే అసమానతల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
దేశంలో శతాధిక కోటీశ్వరుల్లో మొదటి 10 మంది సంపదపై 5 శాతం, లేదా తొలి వంద మంది కుబేరుల సంపదపై 2.5 శాతం పన్ను విధించడం ద్వారా ఆ మొత్తంతో దేశంలో విద్యకు దూరమైన పిల్లలందరినీ తిరిగి పాఠశాలలకు పంపవచ్చునని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నా..ఆ ఘోషలేవీ కేంద్ర ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. దేశంలోని కుబేరులపై కనీసం ఒకసారైనా కేవలం 2 శాతం పన్ను విధిస్తే..దాని వల్ల మూడేళ్ల పాటు దేశంలో పోషకాహారలోపం లేకుండా చేయడానికి అవసరమైన నిధులు సమకూరుతాయి. కార్పొరేట్‌ దిగ్గజాల అడుగులకు మడుగులొత్తుతూ వారి సేవలో పునీతమౌతున్న మోడీ సర్కార్‌కు ఈ సోయి లేకపోయింది. కుబేరులు ఎన్నికల బాండ్ల ద్వారా కుమ్మరిస్తున్న సొమ్ముతో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చివేయడం, లేదా వేధింపులకు గురి చేయడం, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం ద్వారా బిజెపి ప్రజాస్వామ్యాన్ని ధ్వసం చేస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలను అమల్జేస్తున్న బిజెపిని, దానికి వంతపాడుతున్న పార్టీలను నిలదీసేందుకు ప్రజల దృష్టిని జాతి, మత విభేదాల వైపు కాకుండా దేశాభివృద్ధికి అవలంబించాల్సిన ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాల వైపు మళ్లించాల్సిన అవసరముంది.