న్యూఢిల్లీ: త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. త్రిపుర నూతన గవర్నర్‌గా తెలంగాణకు చెందిన బిజెపి సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్‌గా ఝార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్‌లను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందినవారు. ఆయన గతంలో మలక్‌పేట నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి చేరికలు, సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా 2022లో నియమితులైన విషయం తెలిసిందే. ఒడిశా గవర్నర్‌గా నియమితులైన రఘుబర్‌దాస్ ప్రస్తుతం బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.










