Jul 28,2021 13:15

ముంబయి : దిగ్గజ భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు నందు నటేకర్‌ (88) బుధవారం కన్నుమూశారు. వయో భారంతో పుణెలో ఆయన తుది శ్వాస విడిచారు. 1956లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ గెలిచారు. ఆయన కెరీర్‌లో 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించారు. ఆయనకు ఒక కుమారుడు గౌరవ్‌, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 'నందు నటేకర్‌ ఇంట్లోనే సహజ మరణం చెందారు. మేమంతా ఆయన వెంటే ఉన్నాం. మూడు నెలలుగా ఆయన కాస్త నలతగా ఉంటున్నారు. మేమెంతగానో ప్రేమించే మా నాన్న నందు నటేకర్‌ 2021, జులై 28న కన్నుమూశారని బాధాతప్త హఅదయంతో తెలియజేస్తున్నాం. కొవిడ్‌ నిబంధనల కారణంగా మేం ఎలాంటి సంతాప కార్యక్రమం ఏర్పాటు చేయడం లేదు. మీరంతా ఆయనను మనసులోనే స్మరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని నటేకర్‌ కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోడీ, అసోం ముఖ్యమంత్రి హిమాంత విశ్వ శర్మ తదితరులు సంతాపం తెలిపారు.
మహారాష్ట్ర సంగ్లిలో జన్మించిన నటేకర్‌ బ్యాడ్మింటన్‌లో తనదైన ముద్ర వేశారు. 1954 ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నారు. 1956లో మలేసియాలో సెలాంజర్‌ ఇంటర్నేషనల్‌ సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. 1951-1963 మధ్య థామస్‌కప్‌లో భారత జట్టు తరఫున 16 సింగిల్స్‌లో 12, 16 డబుల్స్‌లో 8 గెలిచారు. 1959, 1961, 1963లో జట్టును నడిపించారు. 1965 కామన్వెల్త్‌ క్రీడల్లోనూ ఆయన పాల్గొన్నారు.1961లో ఆయన అర్జున అవార్డు అందుకున్నారు