వాషింగ్టన్ : భారతీయ సంతతికి చెందిన అమెరికన్, కాంగ్రెస్ సభ్యుడు డా. అమి బెరా (58) ను చాంపియన్ ఆఫ్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ అవార్డు వరించింది. అధిక నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణను అత్యంత తక్కువ ధరకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అందించిన కృషికి గాను ఆయనను ఈ అవార్డుతో సత్కరించారు. అమెరికా కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం కొనసాగిన ఇండియన్ అమెరికన్‌గా ఖ్యాతి పొందారు. హెల్త్ ఇన్ ఫోకస్ నుండి చాంపియన్ ఆఫ్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ అవార్డు పొందడం గౌరవంగా భావిస్తున్నానని అమిబెరా శుక్రవారం ట్వీటర్‌లో పేర్కొన్నారు. ప్రతి అమెరికన్ అత్యంత నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులో ఉండేలా పనిచేయానికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. 2013లో కాంగ్రెస్ నేతగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. అప్పటి నుండి అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో శాక్రమెంటో కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ప్రస్తుతం హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.