
టోక్యో : భారత మహిళల హాకీ జట్టు కోచ్ జోయర్డ్ మరీన్ తన పదవికి రాజీనామా చేశారు. టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా కాంస్య పతకం కోసం భారత మహిళల హాకీ జట్టు బ్రిటన్‌తో మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల తరువాత ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్.. తన చివరి అసైన్‌మెంట్ అని, తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాననే భావిస్తున్నానని పేర్కొన్నారు. కోట్లాది మంది భారతీయుల కలలను సాకారం చేయడానికి అహర్నిశలు శ్రమించానని అనుకుంటున్నట్లు చెప్పారు. తనకు, మహిళల హాకీ జట్టుకు ఇన్నేళ్లుగా అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీ జట్టు పతకాన్ని సాధించలేకపోయినప్పటికీ.. కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నామని వ్యాఖ్యానించారు. నెదర్లాండ్స్‌కు చెందిన జోయర్డ్ మరీన్.. 2017 నుంచి భారత మహిళల హాకీ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
జోయర్డ్ మారీన్ హఠాత్తుగా రాజీనామా చేయడానికి గల కారణాలు ఏమిటనేది స్పష్టంగా తెలియరాలేదు. సుదీర్ఘ కాలంగా ఆయన తన కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తోన్నందు వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. భారత మహిళల హాకీ కోచ్ కాంటాక్ట్ గడువును పొడిగిస్తామనే సంకేతాలను హాకీ ఇండియా ఇచ్చినప్పటికీ.. ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. కుటుంబంతో గడపాలనే కారణంతోనే కోచ్‌గా బాధ్యతల నుంచి తప్పుకొంటున్నానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్‌డౌన్ అమలు చేసినప్పటి నుంచీ ఆయన భారత్‌లోనే ఉంటున్నారు. ఒలింపిక్స్ కోసం మహిళల హాకీ జట్టును తీర్చిదిద్దడంలో కీలకంగా మారారు.