
నాటింగ్‌హామ్ : భారత్, ఇంగ్లాండ్ మధ్య నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టెస్ట్ ఫలితం తేలకుండా ముగిసింది. వర్షం కారణంగా చివరి రోజు ఆట ఒక్క బంతి పడకుండానే తుడిచిపెట్టుకోపోయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అంపైర్లు చివరి రోజు ఆటను రద్దు చేసి మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. దీంతో విజయం ముంగిట నిలిచిన కోహ్లీసేనకు నిరాశే ఎదురైంది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. దీంతో విజయానికి ఇంకా 157 పరుగులే అవసరం కాగా.. చేతిలో 9 వికెట్లు, రోజంతా ఆట మిగిలే ఉండడంతో విజయం భారత్ సొంతమని అందరూ భావించారు. అయితే, అనూహ్యంగా కురిసిన వర్షం ఐదో రోజు మ్యాచ్‌ను పూర్తిగా అడ్డుకుంది. వేచి చూసినా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇరు జట్లకూ చెరో నాలుగు పాయింట్లు దక్కాయి. కాగా, గత 20 టెస్టుల్లో భారత్‌కు ఇది మూడో డ్రా కావడం గమనార్హం. ఈ నెల 12 నుంచి లార్డ్స్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది.
స్కోరు బోర్డు వివరాలు :
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 183 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : 278 ఆలౌట్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 303 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్ : 52/1