Jul 31,2021 00:00

న్యూఢిల్లీ : భారత్‌, చైనాల మధ్య సైనిక స్థాయి చర్చలు మోల్డోలో శనివారం ప్రారంభం కానున్నాయి. తూర్పు లడఖ్‌లో తదుపరి దశ సైనిక బలగాల ఉపసంహరణకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఈ చర్చలు ఉద్దేశించబడ్డాయి. మూడు మాసాల విరామం తర్వాత తాజా దఫా చర్చలు జరుగుతున్నాయి. భారత సైనిక ప్రతినిధులు చైనా ప్రతినిధి బృందంతో సమావేశమై బలగాల ఉపసంహరణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని మిలటరీ వర్గాలు తెలిపాయి. ఘర్షణాయుత ప్రాంతాలైన హాట్‌ స్ప్రింగ్స్‌, గాగ్రా, డెస్‌పాంగ్‌ మైదానాల నుండి బలగాలను ఉపసంహరించడంపై ఈ చర్చలు జరగనున్నాయి. గతేడాది మేలో ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ముందుగా హాట్‌ స్ప్రింగ్స్‌, గాగ్రాల్లోని సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం జరగాలని సైనికాధికారి తెలిపారు. డెస్‌పాంగ్‌ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి కొంత సమయం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.