ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను చూసి వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందని టిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకులు, పోలీసులు చేసే తాటాకు చప్పళ్లకు నారాలోకేశ్' అడుగులు ఆగవని అన్నారు. శుక్రవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరిగిన ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లోకేశ్ పాదయాత్రకు సవాలక్ష నిబంధనలు పెట్టారన్నారు. అన్ని అనుమతులు తీసుకుని యాత్ర చేస్తున్నా ఇబ్బందులు పెడుతున్నారంటే ఆయనంటే వైసిపికి ఎంత భయమో అర్థమవుతోందన్నారు. లోకేశ్ పాదయాత్ర బంగారుపాళ్యం వేరుకోగానే విద్యుత్ నిలిపివేశారని, 3 వాహనాలు సీజ్ చేశారన్నారని అన్నారు. పోలీసులు యువగళం వలెంటీర్లను హింసిస్తున్నారని ఆరోపించారు. లోకేశ్ సభలు నిలిపివేయడం, మైకు లాగేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరోచెప్పిన మాటలు విని డీఎస్పీ నారాలోకేష్ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే న్యాయస్థానంలో దోషిగా నిలబడక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్, చింతలపల్లిమహేశ్ చౌదరి, చింతవులును పెద్దన్న, పురుషోత్తం గౌడ్, నాగూర్ ఉస్సేన్, రాంపురంశీన, చిగిచెర్గ రాఘవరెడ్డి, గోసల శ్రీరాములు, కేశగాళ్ల శీన, మాబు, తోటవాసుదేవ తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్లు విడుదల : నారాలోకేశ్ యువగళం పాదయాత్ర వారంరోజుల్లో వందకిలోమీటర్లు చేరుకున్న నేపథ్యంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం తెలుగుయువత, టీఎన్‌ఎస్‌ఎఫ్. ఐటీడీపీ నాయకులు పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుమలేశ్, టీఎన్‌ఎస్‌ఎఫ్ పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్మాద్. సోషియల్ మీడియా పార్లమెంట్ కో ఆర్డినేటర్ తోటవాసుదేవ, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు సురేశ్, పట్టణ అధ్యక్షుడు చెలిమిశివరాం, నాయకులు నాగేంద్ర, తొగట అనిల్ తదితరులు పాల్గొన్నారు.










