Jul 17,2023 09:45
  • యోగి సర్కారు తీరుపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కష్టాలు తప్పటం లేదు. యూనిఫాం, పుస్తకాలు వారికి అందలేదు. గత మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు యూనిఫాం లేకుండానే తరగతులకు హాజరవుతుండటం గమనార్హం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రాథమిక పాఠశాలలకు కొత్త అకడమిక్‌ సెషన్‌ ఏప్రిల్‌ 1న ప్రారంభమైంది. అయినప్పటికీ, యోగి సర్కారు ప్రాథమిక పాఠశాలలు (1 నుండి 5 తరగతులు), ప్రాథమికోన్నత పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలకు డబ్బును బదిలీ చేయడంలో విఫలమైందని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల జాతీయ స్థాయి సంస్థ రాష్ట్రీయ షేక్‌శిక్‌ మహాసంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎం) జాతీయ ప్రతినిధి వీరేంద్ర మిశ్రా తెలిపారు. ఇదిలా ఉంటే మొదటి టర్మ్‌ పరీక్షలు ఇంకా నెలరోజులు మాత్రమే ఉండటం గమనార్హం. 2021లో షర్టులు, ప్యాంటు (రెండు సెట్లు), స్వెటర్లు, షఉలు, సాక్స్‌లు, స్కూల్‌ బ్యాగ్‌తో సహా యూనిఫాంల కొనుగోలు కోసం విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు రూ.1,200 జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే నేటికీ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ బదిలీ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని లఖింపూర్‌, బహ్రైచ్‌, సీతాపూర్‌, బల్లియా, అజంగఢ్‌లతో సహా అనేక పాఠశాలలకు కొత్త సెట్‌ల పుస్తకాలు చేరలేదు. యుపిలోని 1.58 లక్షల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో సుమారు 1.87 కోట్ల మంది విద్యార్థులు చదువుతున్నారు.