ప్రజాశక్తి - ఎంవిపి కాలనీ : ఆంధ్రా యూనివర్శిటీలో మార్చి 3,4, తేదీలలో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వల్లవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు బుధవారం పరిశీలించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో సదస్సు ప్రధాన వేదికను ఏర్పాటు చేయనున్నారు. బీచ్ రోడ్ లోని ఎంజిఎం పార్కులో అతిథులకు డిన్నర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఆ ప్రాంతాన్ని కూడా వీరు పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి అధికారులతో సమావేశమై, సదస్సు నిర్వహణకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. ఆ తర్వాత విశాఖ జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో మంత్రి అమర్నాథ్, కరికాల వల్లవన్ సమావేశమై గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సును ఏ విధంగా విజయవంతం చేయాలో వివరించారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తల నుంచి వీరు సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమర్‌నాథ్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులు నిర్వహించలేకపోయామని తెలిపారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో ఉన్న వనరులు, మానవ వనరులను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు చూపించాలన్నది ప్రధానోద్దేశం అని చెప్పారు. ఈ సదస్సు వల్ల రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు. విశాఖపట్నం-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటుకు సుమారు 50 వేల ఎకరాల భూమిని సిద్ధం చేశామని చెప్పారు. మచిలీపట్నం పోర్టుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని, భావనపాడు మైనర్ పోర్టుగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్‌ఎంఇ బోర్డు చైర్మన్ రవీంద్రనాథ్, సిఐఐ చైర్మన్ ధీరజ్, మేరీటైమ్ బోర్డ్ చైర్మన్ కాయల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










