Aug 14,2023 23:00

ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డులపై సైన్స్‌ పోస్టర్లు ఆవిష్కరణ చేస్తున్న ఎంఎల్‌సి మొండితోక అరుణ్‌ కుమార్‌


ప్రజాశక్తి - నందిగామ : విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను వెలికితీసి వారిని భావి భారత శాస్త్రవేత్తలు, మేధావులుగా ఇప్పటి నుంచే తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డుల పథకాన్ని అమలు చేస్తోందని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇన్‌స్పైర్‌ మనక్‌ అవార్డులపై సైన్స్‌ ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు. శాసనమండలి సభ్యులు మొండితోక అరుణ్‌ కుమార్‌ పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రాజెక్టుల ఆన్లైన్‌ నామినేషన్ల విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి మొండితోక అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ మన చుట్టూ ఎందరో బాల మేధావులు ఉంటారని, తాము చూసిన అంశానికి నూతనత్వం జోడిస్తే అది మరింత మెరుగైన అంశంగా రూపొందించవచ్చనే ఆలోచన వారి మస్తిష్కంలో ఉంటుందని చెప్పారు. అలాంటి వారిని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ 2009-10 నుంచి ఇన్‌స్పైర్‌ మనక్‌కు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోందని తెలిపారు.