Jul 29,2021 11:03

ముంబయి : వియాన్‌ ఇండ్రస్టీలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై అశ్లీల చిత్రాల కేసులో పట్టుబడ్డ రాజ్‌కుంద్ర, ఆయన సతీమణి, ప్రముఖ నటి శిల్పాశెట్టికి సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ (సెబీ) మూడు లక్షల రూపాయాల జరిమానా విధించింది. తమ సంస్థ వియాన్‌ నుండి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కు బహిర్గతం చేయాల్సిన వివరాలను మూడేళ్ల నుండి వాయిదా వేయడంతో ఈ పెనాల్టీ వేసినట్లు సెబీ పేర్కొంది. వియాన్‌ ఇండ్రస్టీస్‌కు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న కుంద్రా, శిల్పా శెట్టిఉమ్మడిగా లేదా పలుమార్లు ఈ పెనాల్లీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. '2013 సెప్టెంబర్‌ 1 నుండి 2015 డిసెంబర్‌ 23 వరకు వియాన్‌ ఇండిస్టీస్‌కు చెందిన రశీదుల ట్రేడింగ్‌, లావాదేవీలపై సెబీ దర్యాప్తు నిర్వహించింది. ఈ దర్యాప్తులో సంస్థతో పాటు రాజ్‌ కుంద్రా, శిల్పాశెట్టి సెబీ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేటతెల్లమైంది' అని సెబీ ఉత్తర్వులో పేర్కొంది. 2015లో వియాన్‌ సంస్థ 5 లక్షల ఈక్విటీ షేర్స్‌ను ప్రిఫరెన్షిల్‌ కేటాయింపు కింద నలుగురు చెల్లించింది. ఇందులో 1,28,800 ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటి చొప్పున ప్రమోటర్లైన కుంద్రా, శిల్పాకు కేటాయించింది. సెబీలోని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ రూల్స్‌ నిరోధం నిబంధన 7(2) (ఎ) ప్రకారం ...వాటి విలువ రూ. 10 లక్షలు దాటితే కంపెనీ ప్రమోటర్లు రెండు రోజుల లోపు తమ లావాదేవీలను కంపెనీకి వెల్లడించాలి లేదా...రెండు ట్రేడింగ్‌ రోజుల్లో స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు బహిర్గతం చేయాలి. వీటిని బహిర్గతం చేయనందున...ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.3 లక్షల జరిమానా విధించింది.