Nov 15,2023 21:38

పార్కును పరిశీలిస్తున్న డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని మహిళా పార్కు నిర్వహణ బాధ్యతను ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ ప్రతినిధులతో కూడిన కమిటీకి అప్పగిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి వెల్లడించారు. 17వ డివిజన్‌ ప్రకాశం పార్కును ఆరు నెలల క్రితం మహిళా పార్కుగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే. పార్కులో క్రీడా సామాగ్రి, వ్యాయామ పరికరాలతో పాటు ఈత కొలను కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం సమయాలలో ప్రొజెక్టర్‌తో వినోద కార్యక్రమాలు ప్రదర్శించే విధంగా వేదికను కూడా నిర్మించారు. కేవలం మహిళలకే ప్రవేశాన్ని కల్పిస్తూ పార్కును నిర్వహణను చేపట్టారు. ప్రతి బుధవారం పార్కునకు సెలవు ప్రకటించి నిర్వహణ చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పార్కును డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, లయ యాదవ్‌ తో పాటు కమిటీ సభ్యులతో పార్కును బుధవారం సందర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూమహిళా పార్కునకు మరింత ఆదరణ పెరిగి ఎక్కువమంది వచ్చే విధంగా చూసేందుకు అవసరమైన నిర్వహణ బాధ్యతలను ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ మహిళ ప్రతినిధులకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ ప్రతినిధులు ఉమా బాలాజీ, కమిటీ ప్రతినిధులు, నగరపాలక సంస్థ ఇఇ దక్షిణామూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ సాంబమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
సచివాలయాల్లో డిస్‌ప్లే బోర్డులు
'రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలంటే' అనే కార్యక్రమాలు బుధవారం 7,15,17వ డివిజన్లలో జరిగాయి. డివిజన్లలోని లబ్ధిదారులకు ఎంత మేర ఏయే పథకాల ద్వారా అందిందో వివరించే డిస్‌ ప్లే బోర్డులను ఆయా సచివాలయాలలో ఆవిష్కరించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలలో వైసిపి నగర అధ్యక్షులు ఆసపు వేణు, రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండల డైరెక్టర్‌ బంగారు నాయుడు, పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేతతంలో ప్రజా రంజక పాలన సాగుతుందన్నారు. ప్రజల ముంగిటికే సచివాలయ వ్యవస్థ ద్వారా పతకాలు అందిస్తున్నారని తెలిపారు. జోనల్‌ ఇన్చార్జులు రెడ్డి గురుమూర్తి, బోడసింగి ఈశ్వరరావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు అల్లు చాణిక్య, ఆసపు సుజాత, పొంతపల్లి మాలతి, తదితరులు పాల్గొన్నారు.