ప్రజాశక్తి-ఈపూరు : మండలంలో జరుగుతున్న భూ రీసర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు, సిబ్బందిని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ ఆదేశించారు. మండలంలోని ఇనిమెళ్లను మంగళవారం సందర్శించిన ఆయన సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. మూమెంట్ రిజిస్టర్లను పరిశీలించడంతోపాటు సచివాలయ సిబ్బంది యూనిఫామ్ లేకుండా ఉండటాన్ని గుర్తించి వారికి నోటీసులు ఇవ్వాలని ఎంపిడిఒ ఎవి రంగనాయకులను ఆదేశించారు. డంపింగ్ యార్డులో వర్మీ కంపోస్ట్ ఎందుకు తయారు చేయడం లేదని పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. పంచాయతీలో ఇంటి పన్ను డిమాండ్‌పై ఆరా తీశారు. వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్ బదిలీపై వెళ్లడంతో ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయని, సేవలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. డిజిటల్ అసిస్టెంట్ పనులను ఇంజినీరింగ్ అసిస్టెంట్ అందించాలని, వెల్ఫేర్ అసిస్టెంట్ సేవలను మహిళా సంరక్షణ కార్యదర్శి అందించాలని కలెక్టర్ సూచించారు. నూతన గ్రామ సచివాలయ భవనంలో విధులు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ అచ్యుత వెంకట సుధాకర్, మండల సర్వేయర్ టి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.










