Sep 23,2023 00:08

ప్రజాశక్తి - బాపట్ల
అంగన్వాడీల సమస్యలపై ఈ నెల 25న విజయవాడలో జరిగే మహా ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఝాన్సీ కోరారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో శుక్రవారం జరిగిన అంగన్వాడీల మహాధర్నా సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. దశాబ్దాల నుండి గ్రామీణ, పట్టణ మురికివాడల్లో నివసించే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన గర్భవతులు, బాలింతలు, సున్నా నుండి 6ఏళ్ళలోపు పిల్లలకు సేవలందిస్తున్న అంగన్వాడీల జీతాలు పెంచడం, గ్రాడ్యుటి ఇవ్వటం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తోందని అన్నారు. కనీస వేతనాలు ఇవ్వడంలేదన్నారు. అన్నిరకాల ధరలు పెరుగుతున్నా తమ వేతనాలు మాత్రం తరగడం లేదన్నారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కోరారు. తెలంగాణా కంటే రూ.ఒకవెయ్యి అదనంగా వేతనం ఇస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఐసిడిఎస్ పిడికి అందజేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి రేఖ, ప్రాజెక్ట్ నాయకులు శైలశ్రీ, సీత,హేమ పాల్గొన్నారు.