Jan 08,2023 21:54

ప్రజాశక్తి - ఏలూరు
         ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కీలకమైన ఐటిడిఎలో ఇన్‌ఛార్జి అధికారులతో పాలన సాగించడంతో గిరిజనాభివృద్ధికి తీవ్ర ఆటంకంగా ఉందని, ఐటిడిఎ పిఒగా ఐఎఎస్‌ అధికారులను నియమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్‌ చేశారు. స్థానిక పవరుపేటలోని ఉద్దరాజు రామం భవనంలో ఆదివారం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుల సమావేశం తెల్లం రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఐటిడిఎ అభివృద్ధికి ఐఎఎస్‌ అధికారులను ఐటిడిఎ పిఒగా నియమించాలన్నారు. రెగ్యులర్‌ పిఒ లేకపోవడంతో గిరిజనులు తమగోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జులు కేవలం ఐటిడిఎ సమావేశాలకు మాత్రమే వచ్చి వెళుతున్నారని, గిరిజనుల కోసం ప్రతీ బుధవారం నిర్వహించే గిరిజన దర్బారుకు అధికారులు అందుబాటులో లేకపోవడంతో గిరిజనులు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. నిర్వాసితులకు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో నిర్మించిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఐటిడిఎ పిఒ ప్రత్యేక అధికారులుగా ఉండి వాళ్లకు ఉన్న సమస్యలు, ఇబ్బందులు పరిష్కరించేవారని తెలిపారు. కొంతకాలం నుండి ఇన్‌ఛార్జి పిఒలను నియమించి పరిపాలన సాగించడంతో, ఒకరి తర్వాత ఒకరిని వెంటవెంటనే బదిలీ చేయడంతో గిరిజనుల బాధలు వినే అధికారులు లేకుండా పోయారన్నారని వాపోయారు. డిప్యూటీ డిఎంహెచ్‌ఒ, డిడి కీలక అధికారులందరూ ఇన్‌ఛార్జులతోనే పరిపాలన చేయించడం చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఏ మాత్రమూ చిత్తుశుద్ధి లేదని అర్థమవుతుందని విమర్శించారు. డిఎంహెచ్‌ఒ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిడి తదితర అధికారులందరినీ నియమించాలని కోరారు. ప్రభుత్వం స్పందించి ఐటిడిఎ అభివృద్ధి కోసం రెగ్యులర్‌ అధికారులను నియమించాలని, లేనిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలోని ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిఎన్‌విడి.ప్రసాద్‌, పి.కిషోర్‌, ఆర్‌.లింగరాజు, ఎం.నాగమణి, జి.రాజు పాల్గొన్నారు.