ఇనాం భూములకు పరిష్కారం చూపాలి
ఎర్రమరెడ్డి పాలెం రైతుల ధర్నా
ప్రజాశక్తి -తిరుపతి టౌన్
రేణిగుంట మండలం ఎర్రమరెడ్డి పాలెం గ్రామ రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి ఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి హేమలత మాట్లాడుతూ ఎర్రమరెడ్డి పాలెం ఇనాం గ్రామమని, ఇనాందారు అయిన వారు కె.ఎస్.రామానుజం అనే వ్యక్తికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాయించారన్నారు. ఇది ఐదు రూపాయలు స్టాంపు పై రాసుకున్నారు. కాబట్టి ఇది చెల్లదని,తాము మొదట 1985లో ఆర్డిఓ కోర్టుకు వెళ్లగా ఆ కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. 1992లో అదే వ్యక్తి కె.ఎస్. రామానుజం తిరిగి సీసీఎల్ కోర్టుకు పోయారని, అక్కడా రైతులకు అనుకూలంగానే తీర్పు వచ్చిందన్నారు. తర్వాత ఏపీఐఐ సి డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి ఈనాందారులు114.75 సెంట్లు అమ్మారని, దీనికి సంబంధించి నష్టపరిహారం కూడా అతనికి చెల్లించడం జరిగిందన్నారు. ఇనాంధారులైన వారికి హైకోర్టు 113 ఎకరాల 13 సెంట్లు భూమి కి మాత్రమే తీర్పు ఇస్తే వారు 114 . 75 సెంట్లు అమ్మడం జరిగిందన్నారు. తర్వాత 2014లో రేణిగుంట ఎమ్మార్వో ముస్తఫా ఖాన్ ఇచ్చిన పట్టాలను ఫీల్డ్ పైన పరిశీలించి ఎంక్వయిరీ చేసి సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. అయితే ఆ ఎమ్మార్వో ఏదో పొరబాటు చేసారని ఆయనను సస్పెండ్ చేస్తూ ఆయన ఇచ్చిన పట్టాలు రద్దు చేయడంతో సమస్య మళ్ళీమొదటి కొచ్చింది. ఈ భూములకు సంబంధించి అభ్యంతరాను తెలియజేయాలని కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారని, దీనికి సంబంధించిన అన్ని రికార్డులను, జిరాక్స్ కాపీలను జతపరచి వందమంది రైతుల ఆధ్వర్యంలో 'ఎర్రమరెడ్డిపాలెం గ్రామ రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలి' అని పేర్కొన్నారు. అనంతరం ఆర్డీవో ఎవోకు వినతిపత్రం ఇచ్చారు. రైతులు కె.మునిరామయ్య, జి.నాగరాజా, పి.సుబ్రమణ్యం, చంద్రయ్య, పి.సిద్దయ్య పాల్గొన్నారు.










