ప్రజాశక్తి-యంత్రాంగం
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కె.పట్టాభిరామ్‌పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, తీవ్ర గాయాలయ్యాయని ఈనాడు తప్పుడు రాతలు రాసిందంటూ వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. పలుచోట్ల ఈనాడు దిన పత్రికలను గురువారం దగ్ధం చేశారు. పలు చోట్ల సమావేశాలు నిర్వహించి ఈనాడు కథనాన్ని ఖండించారు.
గాజువాక : గాజువాక బిసి రోడ్డులోని టిఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఈనాడు పత్రికలను ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యాన దగ్ధంచేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి ఈనాడు పత్రిక యజమాని రామోజీరావు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై ఈనాడు పత్రిక కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చందు, వంశీరెడ్డి, కేబుల్ మూర్తి, వైసిపి నాయకులు తిప్పల దేవన్‌రెడ్డి, పరదేశి, చిత్రాడ వెంకటరమణ, బొడ్డ గోవిందు పాల్గొన్నారు.
కంచరపాలెం : పచ్చ కుల మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి అబద్ధపు వార్తలను రాసిందని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పశ్చిమ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. మర్రిపాలెం ఉడా లే-అవుట్‌లోని పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టాభిరామ్‌పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తప్పుడు రాతలు రాసిందని, దీనిపై ప్రభుత్వం స్పందించి చిత్తశుద్ధితో వైద్య పరీక్షలు చేయించగా, కేవలం అవి అనారోగ్య సమస్యల వల్ల వచ్చిన వాపులు మాత్రమేనని నివేదిక వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. లోకేష్ పాదయాత్ర విఫలమవడం, ప్రజల ఆదరించకపోవడంతో చంద్రబాబుకు దిక్కు తోచక ఇటువంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గాది శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్లు పివి సురేష్, బెహరా భాస్కరరావు, గుండపు నాగేశ్వరరావు, ముర్రువాణి నానాజీ, నాయకులు కలిదిండి బద్రీనాథ్, దొడ్డి కిరణ్, చుక్కా ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు










