Sep 11,2023 18:55

కావలి పోలీస్‌ స్టేషన్‌ లో ఉన్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు :తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ, బంద్‌ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో.నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్‌ ఇంటూరి నాగేశ్వరరావుని హౌస్‌ అరెస్ట్‌ చేయడంతో ఆయన ఆదేశాలతో కందుకూరు పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం 5 గంటల నుంచి కందుకూరు అర్‌టిసి డిపో గ్యారేజ్‌ వద్ద పోమవారం బైఠాయించారు. డిపోలో నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు నాయుడుని వెంటనే విడుదల చేయాలని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దాదాపు గంటసేపు నినాదాలతో హౌరెత్తించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని, ఆ సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా బందుకు సహకరించాలని పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ డిపోలో నుంచి బస్సులు బయటకు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన విరమించాలని పార్టీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. తమ నాయకుడిని అరెస్టు చేయటంతో పార్టీ రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునిచ్చిందని అందులో భాగంగానే ఆందోళన చేస్తున్నామని నేతలు తెలిపారు. బంద్‌ కు ఎలాంటి అనుమతులు లేవని, అందర్నీ అరెస్టు చేస్తున్నామని చెప్పి నేతలందరినీ అదుపులోనికి తీసుకునేందుకు ప్రయత్నించారు. పార్టీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ, పోలీసులు వారందరినీ ఈడ్చుకెళ్ళి పట్టణ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, గోచిపాతల మోషే, చిలకపాటి మధు, షేక్‌ రఫీ, బెజవాడ ప్రసాద్‌, పొడపాటి మహేష్‌, పులి నాగరాజు, చుండూరి శ్రీను, షేక్‌ ఫిరోజ్‌, జిల్లెల్లమూడీ రవి, రాజశేఖర్‌, శివరామిరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.