ప్రజాశక్తి - గుంటూరు : ఇంటర్ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిన విడుదల చేసిన ఫలితాల్లో ఉత్తీర్ణత శాతంలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా, ఇంటర్ మొదటి సంవత్సరంలో మూడో స్థానం, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచింది. కోవిడ్ వల్ల గతేడాది అందర్నీ ఉత్తీర్ణులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత తగ్గింది. ద్వితీయ సంవత్సరంలో పెరిగింది.
ఈ ఏడాది మార్చి 15 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు బాలురు 23,412 మందికిగాను 15,184 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 22,798 మందికిగాను 16,219 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 65 శాతం, బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 46,210 మందికిగాను 31,403 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో 68 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో గుంటూరు జిల్లా మూడో స్థానంలో నిలిచింది.
ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలురు 20,220 మందికిగాను 15110 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 19,261 మందికి గాను 15,673 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 75 శాతం, బాలికలు 81 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 39,481 మంది పరీక్షకు హాజరు కాగా 30783 మంది ఉత్తీర్ణులయ్యారు. 78 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. 2020 పలితాలతో పోలిస్తే మొదటి సంవత్సరంలో రెండు శాతం తక్కువగా, ద్వితీయ సంవత్సరంలో రెండు శాతం ఉత్తీర్ణత పెరిగింది. రీకౌంటింగ్, రీవ్యాలుయేషన్‌కు మే 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ ఆర్‌ఐఒ సునీత తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 1వ తేదీ వరకూ నిర్వహిస్తారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 3వ తేదీ ఆఖరు.










