Mar 13,2022 12:01

పదేళ్ల క్రితం 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు అలియాభట్‌. గడిచిన దశాబ్దంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే ఆమె చేసిన లేడీ ఓరియంటెడ్‌ కథలను వేళ్ల మీద లెక్కించాల్సిందే. 'రాజీ' తర్వాత ఆమె నటించిన అలాంటి మరో సినిమా 'గంగూబాయి కతియావాడి'. ముంబైలోని అతి పెద్ద వేశ్యావాటిక కామాటిపురాలోని గంగూబాయి అనే నాయకురాలి జీవితం ఆధారంగా దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. కాగా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్‌తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు చేరుకుంది? కథేంటో విషయాలు తెలుసుకుందాం..
నటీనటులు : అలియా భట్‌, అజరు దేవగన్‌, విజయ్ రాజ్‌, శంతను మహేశ్వరి,హొ ఇందిరా తివారి తదితరులు
దర్శకత్వం : సంజయ్ లీలా భన్సాలీ
నిర్మాత : జయంతి లాల్‌ గడా
సంగీత దర్శకుడు : సంచిత్‌ బల్హారా, అంకిత్‌ బల్హారా, సంజయ్ (పాటలు)
సినిమాటోగ్రఫీ : సుదీప్‌ చటర్జీ
ఎడిటర్‌ : సంజయ్ లీలా భన్సాలీ
బ్యానర్‌ : భన్సాలీ ప్రొడక్షన్‌, పెన్‌ ఇండియా లిమిటె
డ్‌

కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని ఓ ఉన్నత కుటుంబంలో పుడుతుంది. ఆమెకు చిన్నతనం నుంచే సినిమాలంటే ప్రాణం. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని కల కంటూ ఉంటుంది. అయితే, తన తండ్రి దగ్గర పనిచేసే గుమాస్తాను ఆమె ప్రేమిస్తుంది. అయితే, గంగూబాయి హర్జీవందాస్‌ ఆసక్తిని, ఇష్టాన్ని ఆసరా తీసుకున్న ఆమె ప్రియుడు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి, తల్లిదండ్రులకు తెలియకుండా ఆమెను ముంబై తీసుకొస్తాడు. ఆ తర్వాత ఆమెను కామాటిపురలోని ఓ వేశ్యా గృహానికి అమ్మేస్తాడు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో వేశ్య వృత్తిలోకి వచ్చిన గంగూబాయి మనసు చంపుకొని, వేశ్యగానే కొనసాగుతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అక్కడ ఆమెకు మాఫియా లీడర్లతో పరిచయం అవుతుంది. ఆ పరిచయాల వల్ల కామాటిపురా ఆమె చేతికి వస్తుంది. ఈ ప్రయాణంలో రహీమ్‌ లాలా (అజరు దేవ్‌గన్‌) ఆమెకు దన్నుగా నిలుస్తాడు. ఓ సాదాసీదా యువతిగా కామాటిపురాలో అడుగుపెట్టిన గంగ భారత ప్రధానిని కలిసి పడుపువృత్తిలోని మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడటం కోసం, వారి మానమర్యాదలను కాపాడటం కోసం, వారి పిల్లల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. వేశ్యల అభ్యున్నతికి ఎలా కృషి చేసింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? ఆమె తన జీవితంలో ఏమి నష్టపోయిందనేది మిగిలిన కథ.
దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ రెడ్‌లైట్‌ ఏరియాకు చెందిన గంగూబాయి జీవిత కథను తెరకెక్కిస్తానని ప్రక టించినప్పుడు చాలామంది ఆశ్చర్య పోయారు. ఆమె జీవితంలో అంత గొప్ప సంఘటనలు ఏమున్నాయి? అనే ఆలోచనలోపడ్డారు. ఇక ఆ పాత్రకు అలియాను ఎంపిక చేశారని తెలిశాక, వారి అనుమానాలు మరింత పెరిగిపోయాయి. వేశ్యావాటిక నిర్వాహకురాలి పాత్రకు అలియా ఏం ఆనుతుంది? అనే సందేహాలను అనేకమంది వ్యక్తం చేశారు. వారి అనుమానాలకు, సందేహాలకు సినిమాతో సమాధానం చెప్పాడు భన్సాలీ. గంగూబాయి జీవితాన్ని పాజిటివ్‌ యాంగిల్‌లో తెర మీద చూపిస్తూ, తన తోటి మహిళల హక్కుల కోసం ఆమె ఏం చేసిందనే విషయాన్ని హైలైట్‌ చేశాడు. అలానే కామాటిపురాపై తన పట్టును పెంచుకోవడానికి, తమ పిల్లలకు విద్యాబుద్ధులు నెరపడానికి ఆమె చేసిన కృషిని ప్రధానంగా చూపించాడు. దాంతో సహజంగానే గంగూబాయి పాత్రలోకి 'హీరోయిజం' వచ్చి చేరింది. నిజ జీవితంలో గంగూబాయి ఆ స్థాయికి చేరుకోవడానికి ఎన్ని అకృత్యాలకు పాల్పడిందనే విషయానికి పోకుండా, తన మాట నెగ్గించుకోవడానికి ఎంతకైనా తెగించిందనేదే ప్రధానంగా చూపడంతో ఆడియెన్స్‌ ఆమె పాత్రతో కనెక్ట్‌ అవుతారు.

ఇంట్రెస్టింగ్‌ జర్నీ.. 'గంగూబాయి కతియావాడి‘
ఆలియా భట్‌ గంగూబాయి పాత్రలో వెండితెరను వెలిగిస్తుంది. ఆమె గాఢమైన స్వరం, చేతి సంజ్ఞలు, ఆమె నడక.. ఇవన్నీ మన నోట మాట రాకుండా చేస్తాయి. గంగూబాయి పాత్రలోకి అలియా పరకాయ ప్రవేశం చేసింది. కామాటిపూరాను తన చెప్పుచేతల్లో ఉంచుకునే రజియాబాయి పాత్రలో విజరురాజ్‌ మెప్పించాడు. అజరు దేవ్‌గన్‌ ది అతిథి పాత్ర అని టైటిల్స్‌లో వేసినా, అంతకు మించి ప్రాధాన్యమున్న పాత్రను చేశాడు. ఇక జర్నలిస్ట్‌గా జిమ్‌ సెరబ్‌, గంగ ప్రియుడిగా వరుణ్‌కపూర్‌, కమ్లీగా ఇందిరా తివారి నటించారు. గంగూబాయిపై మనసు పడే యువకుడిగా శంతను మహేశ్వరి చక్కటి హావభావాలు ప్రదర్శించాడు. ఇటీవల విడుదలైన 'వలిమై'లో కీలకపాత్ర పోషించిన హుమా ఖురేషీ ఇందులో గజల్‌ గాయనిగా మెరిసింది. ఆ గజల్‌ ఎంతో అర్థవంతంగానూ ఉంది.

ఇంట్రెస్టింగ్‌ జర్నీ.. 'గంగూబాయి కతియావాడి‘
      సంచిత్‌ బల్హారా సంగీతం, నేపధ్య సంగీతం చాలా బాగుంది. సుదీప్‌ ఛటర్జీ సినిమాటోగ్రఫీని బాగా హ్యాండిల్‌ చేశారు. సంజయ్ లీలా భన్సాలి ఎడిటింగ్‌ సినిమాకి ప్లస్‌ అయ్యింది. భన్సాలీ తీసిన ఈ సినిమా నిజంగానే వారి ఇజ్జత్‌ను కాపాడే విధంగానే తెరకెక్కించాడు. అశ్లీలతకు, అసభ్యతకు తావు లేకుండా తీశాడు. అయితే ఇందులో భన్సాలీ మార్క్‌ పాటలు, సంగీతం కాస్త మిస్‌ అయ్యాయని చెప్పాలి.