Jul 24,2023 22:57

మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌

- నేటికీ అందని ఇంటర్‌ పాఠ్య పుస్తకాలు
- ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయాలి
- మెగా డిఎస్‌సి విడుదల చేయాలి
- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ విమర్శించారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ నగరంలోని డేఅండ్‌నైట్‌ కూడలి వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామని చెప్తున్న ప్రభుత్వం, ఇంటర్‌ తరగతులు మొదలై రెండు నెలలు కావస్తున్నా నేటికీ పాఠ్య పుస్తకాలు సరఫరా చేయలేకపోయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 474 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 210 కళాశాలలు ప్రిన్సిపాళ్లు లేక ఇన్‌ఛార్జీల పాలనలో నడుస్తున్నాయని తెలిపారు. 2,700 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఇంతవరకు భర్తీ చేయలేదన్నారు. ఈ కారణంగానే గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 36 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాదింఛారని చెప్పారు. ఖాళీగా ఉన్న లెక్చరర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. దూర ప్రాంతాల నుంచి కళాశాలలకు వచ్చే విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్‌ కాస్మోటిక్‌ ఛార్జీలను పెంచాలన్నారు. మెడికల్‌ కళాశాలలో 50 శాతం సీట్ల అమ్మకాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. మెగా డిఎస్‌సిని వెంటనే విడుదల చేయాలన్నారు. దీక్షలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హరీష్‌, ఉపాధ్యక్షులు యు.దుర్గాప్రసాద్‌, నాయకులు సంతోష్‌, తిరుపతిరావు, రవితేజ, తరుణ్‌, యోహాన్‌, దేవేంద్ర, వంశీ, వినోద్‌, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.