Jul 24,2023 22:04

నిరసన దీక్ష చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-హిందూపురం : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణంలో బిపిఎల్‌ షోరూం ఎదురుగా 5 గంటల పాటు దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొంటున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులకు సిఐటియు జిల్లా కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌ పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు ప్రారంభమై 47 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నేటికీ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వకపోవడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు ఇవ్వడానికి నిరాకరిస్తుందంటే పేద విద్యార్థులకు చదువును దూరం చేయడమేనని విమర్శించారు. 3 వేలకు పైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడం దుర్మార్గమన్నారు. అధ్యాపకులు లేకుండా చదువెలా సాగుతుందని ప్రశ్నించారు. నేటికీ 474 ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో 210 మంది ప్రిన్సిపల్స్‌ లేరని, 26 జిల్లాలకు పర్మినెంట్‌ ఆర్‌ఐఒలు, 13 మంది డిఇఒలు లేరని అన్నారు.. ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలపై భారత విద్యార్థి ఫెడరేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్‌ బోర్డుని కలవడానికి వెళ్తే వారిని కనీసం కలిసే అవకాశం ఇవ్వకుండా రోడ్లపై అరెస్ట్‌ చేయడం సిగ్గుమాలిన చర్యని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, అదే సందర్భంలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, దానికి ఎనిమిది గంటలు నిరసన దీక్షలే ప్రారంభ సూచిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ హిందూపురం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు తరుణ్‌, చంద్రశేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శులు హర్ష కుమార్‌, పవన్‌, సిఐటియు నాయకులు నరసింహప్ప, రామకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జై చంద్ర, లిఖిత్‌, రాజా, నిహాల్‌, వీరేష్‌, బాబా ఫక్రుద్దీన్‌, రంగనాథ్‌, రవితేజ, నందీష్‌, గిరీష్‌, లోకేష్‌, విశ్వ, సూర్య, గిరీష్‌, రామ్‌, ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.