ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు అందించాలి
ప్రజాశక్తి-కావలి : విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు రెండు నెలలు గడుస్తున్నా, ఇంతవరకు ప్రభుత్వం జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దుయ్యబట్టారు. ఈ మేరకు కావలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కసాయి వీధిలోని ఎస్.ఎఫ్.ఐ. కార్యాలయం నుండి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం అక్కడ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శ్రీహర్ష, పి.శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులందరూ మార్కెట్లోకి వెళ్లి పాఠ్యపుస్తకాలను కొనుక్కోవాలని చెప్పడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కాలేజీలోనే విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం కూడా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ హాస్టల్లో మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచి, నాడు - నేడు పనులను ప్రారంభించాలన్నారు. హాస్టల్ ప్రారంభమైనప్పటికీ 30 రోజులు గడుస్తుందని తెలిపారు. హాస్టల్ విద్యార్థులు రావలసిన బెడ్షీట్లు, ట్రంకు పెట్టెలు, కనీస వసతులు ఇంతవరకు అందకపోవడం వల్ల విద్యార్థులకు అనేక ఇబ్బందులు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హాస్టల్లో మెరుగైన వసతులు సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సూర్య, కావలి అధ్యక్షులు అజరు, ఉపాధ్యక్షులు ఉదరు, రాకేష్, సాయిలు, విద్యార్థులు పాల్గొన్నారు.










