ప్రజాశక్తి-గుంటూరు : ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం ఇంటర్ ఆర్‌ఐఒకు వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.కిరణ్ మాట్లాడుతూ గతేడాది వరకూ ఇంటర్ బోర్డు విద్యార్థులకు ఉచితంగ పాఠ్యపుస్తకాలు అందించారని, కానీ ఈ సంవత్సరం నుంచి ఇవ్వబోమని ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. ఇప్పటికే అనేక కష్టాలకోర్చి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులపై ఇటువంటి భారాలు మోపటం సరికాదన్నారు. ఈ విధానాల వల్ల పేదలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా పునరాలోచించి, విద్యార్థులకు యథావిధిగా పాఠ్యపుస్తకాల అందించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని, బెంచీలు ఎలక్ట్రికల్ సామానులు, లైట్లు లాంటి మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలపై ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ఆయా యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.రూపాస్, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి ఎస్.కె. సమీర్, యశ్వంత్, గణేష్, నాసరయ్య పాల్గొన్నారు.










