Sep 02,2023 23:41

ప్రజాశక్తి - బాపట్ల రూరల్
ఇంటర్మీడియట్ విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు అందించాలని ఎస్ఎఫ్ఐ బాపట్ల జిల్లా కార్యదర్శి ఆర్య కోరారు. పివి పాలెం మండలంలోని విద్యా సంస్థలను ఆయన శనివారం సందర్శించారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని చెప్పుకుంటూ ఇంటర్‌ విద్యార్థులకు గత మూడు సంవత్సరాలుగా పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వడంలేదన్నారు. పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారని అన్నారు. ప్రైవేటు కళాశాలలకు అనుమతులు ఇచ్చి విద్యార్థులను ప్రైవేటు విద్య వైపు నెట్టే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. గత సంవత్సరం నుండి కళాశాలలో జరుగుతున్న నాడు నేడు పనులు ఆగిపోయాయని అన్నారు. అరకొర వసతులతో విద్యార్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కనీసం తాగునీటి వసతి కూడా లేదని చెప్పారు. ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న విద్యార్ధులు అందరికీ అమ్మ ఒడి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు మనోజ్ కుమార్ పాల్గొన్నారు.