ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమై సుమారు నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను సరఫరా చేయలేకపోయింది. దీంతో చదివేదెలా అంటూ విద్యార్థులు, పాఠాలు బోధించేది ఎలా అంటూ అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఇంటర్ విద్యా విధానం ఇలా ఉంటే తమ పిల్లల భవిష్యత్ ఏం కావాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 44 ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయి. సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉచితంగా పుస్తకాలను అందజేయాల్సి ఉంది. ఎంపిసి, బైసిపి సహా ఇతర ఆర్ట్స్ గ్రూపుల విద్యార్థులకు అవసరమైన వాటిని రాష్ట్ర ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచి జిల్లాకు సరఫరా చేస్తారు.
కొనాలంటే రూ.6 వేల పైనే
ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదివే విద్యార్థులందరూ పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే. అయితే ఈ ఏడాది కూడా ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించే పరిస్థితి లేకపోవడంతో పలువురు విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోంది. కొందరు సీనియర్ల వద్ద పాత పుస్తకాలను తెచ్చుకుంటుండగా ఎక్కువమంది బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూ.6 వేల నుంచి రూ.7 వేలు వరకు వెచ్చించాల్సి వస్తుంది. బహిరంగ మార్కెట్లో రూ.వేలల్లో సొమ్ములు వెచ్చించి కొందరు విద్యార్థులు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంటర్ విద్యార్థులు సక్రమంగా చదువుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజన పథకం ఇంటర్ విద్యార్థులకు కూడా అమలయ్యేది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత భోజన పథకాన్ని పూర్తిగా రద్దు చేయడంతో విద్యార్థుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. రెండేళ్లుగా పాఠ్యపుస్తకాలను అందించకపోవడంతో ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేయకపోవడంతో ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గడమే ఇందుకు నిదర్శనం.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 42,137 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయగా కేవలం 24,886 మంది మాత్రమే పాస్ అయ్యారు. రెండో సంవత్సరంలో 36,833 మంది పరీక్ష రాయగా 25,330 పాస్ అయ్యారు.










