95 శాతం మంది హాజరు -ముదినేపల్లిలో ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులు - అనుమతి నిరాకరణ
ప్రజాశక్తి - ఏలూరు టౌన్
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆర్‌ఐఒ ప్రభాకర్‌రావు తెలిపారు. ఈ పరీక్షల్లో తొలిరోజు తెలుగు, హిందీ, ఉర్దూ, సంబంధించి 35,007 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా వారిలో 33,427 మంది హాజరయ్యారు. మిగిలిన 1,580 మంది గైర్హాజరయ్యారు. 95 శాతం మంది హాజరైనట్లు తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో తాగునీటి వసతి, సీటింగ్, లైటింగ్‌తోపాటు అత్యవసర వైద్య సేవలందించే విధంగా ఎఎన్‌ఎం, ఆశావర్కర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కో పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్లను, డిపార్టుమెంటల్ అధికారులను ఏర్పాటు చేశారు. జిల్లాలో నాలుగు సిట్టింగ్, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసేందుకు నియమించారు. ఎక్కడా మాస్‌కాపీకి తావులేకుండా పటిష్ట భద్రతను చేపట్టారు. ఏలూరు నగరంలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ, చైతన్య, కోటదిబ్బ జూనియర్ కళాశాల ప్రాంతాల్లో జరుగుతున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్‌పి రాహుల్ దేవ్ శర్మ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ముదినేపల్లి :ముదినేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ మొదటి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 237 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 21 మంది గైర్హాజరైనట్లు డిపార్టుమెంటల్ ఆఫీసర్ రాంబాబు తెలిపారు.
ఆలస్యంగా వచ్చిన ఇద్దరు విద్యార్థులు.. పరీక్షకు నిరాకరణ
పరీక్షకు ఆలస్యంగా రావడంతో ఇద్దరు విద్యార్థులు పరీక్ష రాసే అవకాశం కోల్పోయారు. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత వచ్చిన విద్యార్థులను గేటు వద్ద నిలిపివేశారు. ఆ విద్యార్థులు ప్రాధేయపడినా సమయం దాటిపోవడంతో అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో చేసేదిలేక ఆ విద్యార్థులు వెనుదిరిగారు.
ఉంగుటూరు:నారాయణపురం మహాత్మా గాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తొలిరోజు బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి పి.ఏలేసుబాబు శారీరక వైకల్యంతో బాధపడుతున్నాడు. చేతులతో పరీక్ష రాయలేని పరిస్థితి. ఈ క్రమంలో ఆ విద్యార్థికి సహాయకుడు పరీక్ష రాసేందుకు విద్యాశాఖ అధికారులు అనుమతిచ్చారు. దీంతో ఆ విద్యార్థి సహాయకుడి సహకారంతో పరీక్ష రాశాడు.
భీమడోలు:మండలంలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. జూనియర్ ఇంటర్ విద్యార్థులు తెలుగు/సంస్కృతం పరీక్షలు రాశారు. మండలానికి కేటాయించిన రెండు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో 172 మంది విద్యార్థులకు గాను 17 మంది గైర్హాజరయ్యారు. పొలసానిపల్లి బాలయోగి గురుకుల బాలికల పరీక్షా కేంద్రంలో 210 మందికి గాను 13 మంది పరీక్షలకు హాజరు కాలేదని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు.
జీలుగుమిల్లి : మండలంలో ఇంటర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 170 మందికి గాను 140 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు ప్రిన్సిపాల్ అలీ మొహిద్దిన్ తెలిపారు. 30 మంది గైర్హాజరయ్యారన్నారు.
గణపవరం : ఇంటర్ పరీక్షలు గణపవరం జూనియర్ కాలేజీలో ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 286 మంది విద్యార్థులకు 18 మంది గైర్హాజరయ్యారని ప్రిన్సిపల్ ఎం.రఘు తెలిపారు. వసతులను ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి పర్యవేక్షించారు.
నూజివీడు : పట్టణంలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. స్థానిక ఎంప్లాయీస్ కాలనీలోని శ్రీమడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల, వాగ్దేవి కళాశాల, శ్రీశారద కళాశాల, సెయింట్ ఆన్స్ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిఎస్‌పి అశోక్ కుమార్ గౌడ్, పట్టణ సిఐ మూర్తి ఆదేశంతో ఎస్‌ఐ శివన్నారాయణ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం : ఇంటర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలోని ఏడు పరీక్షా కేంద్రాలో విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాల గుర్తింపులో ఆలస్యం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పోలవరం మండలం నుంచి ప్రయివేటు విద్యార్థులు కొందరు పరీక్షా కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా చేరినట్లు సమాచారం. పరీక్షలకు 2647 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2467 మంది హాజరయ్యారు. 180 మంది గైర్హాజరయ్యారని కస్టోడియన్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎస్‌ఐ సాగర్‌బాబు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.










