Mar 16,2023 21:42

ప్రజాశక్తి - ఏలూరుటౌన్‌
         ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 106 కేంద్రాల్లో తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ భాషా పరీక్షలు జరిగాయి. కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష ప్రారంభమవ్వగా ఎక్కువ మంది విద్యార్థులు 8 గంటలకే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఇంటర్‌ బోర్డు అధికారులు విస్తత ప్రచారం చేయడంతో విద్యార్థులంతా నిర్దేశిత సమయం కంటే ముందుగానేకేంద్రాలకు చేరుకోవడంతో ఒక్క నిమిషం నిబంధన కారణంగా ఎవరినీ ఆపిన దాఖలాలు కన్పించలేదు. పరీక్షల నిర్వహణ తీరును ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌లు తనిఖీ చేశాయి.
32,668 మంది హాజరు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 106 కేంద్రాల్లో మొత్తం 33,638 మంది విద్యార్థులకుగాను 32,668 మంది పరీక్షకు హాజరయ్యారు. ఏలూరు జిల్లాలో 39 కేంద్రాల్లో 10809 మంది జనరల్‌ విద్యార్థులకు 10,477 మంది హాజరవ్వగా 332 మంది గైర్హాజరయ్యారు. 1615 మంది ఒకేషనల్‌ విద్యార్థులకు 1487 మంది హాజరవ్వగా 128 మంది గైర్హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో 52 కేంద్రాల్లో 14,897 మంది జనరల్‌ విద్యార్థులకు 14,584 మంది హాజరవ్వగా 313 మంది గైర్హాజరయ్యారు. 1539 మంది ఒకేషనల్‌ విద్యార్థులకు 1436 మంది హాజరవ్వగా 103 మంది గైర్హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 15 కేంద్రాల్లో 4,097 మందికి 4038 మంది హాజరవ్వగా 59 మంది గైర్హాజరయ్యారు. 681 మంది ఒకేషనల్‌
విద్యార్థులకు 646 మంది హాజరయ్యారు. మొత్తంగా 97 శాతం హాజరు నమోదైంది. కొవ్వూరులో ఒక మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదైంది. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖర్‌బాబు తెలిపారు.