ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: రాష్ట్రంలోని 419 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొదటి స్థానంలో నిలిచిన రేపల్లె ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థి అనిల్‌కు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సౌజన్యంతో బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు సమక్షంలో రూ.5 వేల నగదును ప్రోత్సాహక బహుమతిగా ఇచ్చా రు. కలెక్టరేట్‌లో జరిగిన డిఆర్‌సి సమావేశంలో విద్యార్థి అనిల్‌ను అభినందించారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నే విధంగా రేపల్లె ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చెందిన అనిల్ అనే విద్యార్థి రాష్ట్రంలోని 419 జూనియ ర్ కాలేజీల్లో మొదటి స్థానంలో నిలిచినట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా ప్రతినిధులు ప్రశంసించారు. విద్యార్థి అనిల్ రెండో తరగతిలోనే ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చి రేపల్లె ప్రాంతంలో ఉన్న బెతస్తా బేబీ హౌమ్‌లో ఉంటూ చదువులో రాణించడం గొప్ప విషయమని అన్నారు. తన పేదరికాన్ని సైతం జయించాడని కొనియాడారు. విద్యార్థులందరూ అనిల్‌ను ఆదర్శంగా తీసుకుని చదువులో రాణించాలని అన్నారు. గవర్నమెంట్ జూనియర్ కళాశాల రేపల్లెలో ఎంపిసిలో 1000కి 984 మార్కులు సాధించిన అనిల్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి సుధాకరరావు, అధ్యాపకులు డి శివనాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆర్య పాల్గొన్నారు.










