ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థుల కోసం పరీక్ష ఫీజు చెల్లించే గడువు తేదీని నవంబర్ 30 వరకు ఇంటర్మీడియట్ బోర్డ్ పొడిగించిందని పల్నాడు జిల్లా డిఐఇఒ ఎం.నీలావతిదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పరీక్షల కొరకు ఫీజు గడువు నవంబర్ 30 వరకు పొడిగించిన నేపథ్యంలో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన, డ్రాపౌట్ అయినవారు జనరల్, ఓకేషనరల్ కోర్సు విద్యార్థులు జ్ఞానభూమి పోర్టల్ ద్వారా ఫీజు చెల్లించేలా వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఫెయిల్ అయిన విద్యార్థి అడ్మిషన్ పొంది అన్ని పరీక్షలకు హాజరైతే ఎక్కువ మార్కులు వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకుంటామని, కంపర్ట్మెంటల్ ఫెయిల్ అని కాకుండా ఒకేసారి ఉత్తీర్ణులయ్యారని సర్టిఫికెట్ జారీ చేస్తామని పేర్కొన్నారు. తిరిగి అడ్మిషన్ పొందిన విద్యార్థులకు జగనన్న అమ్మబడి, విద్యా కానుక, గోరుముద్ద వంటి వాటికి అర్హులని వివరించారు.
పెయిట్, డ్రాపౌట్ విద్యార్థులు అడ్మిషన్ పొందేందుకు పల్నాడు జిల్లాలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, కళాశాలకు వెళ్లి ఆయా ప్రిన్సిపల్ సమక్షంలోనే సంబంధిత విద్యార్థులకు ఫోన్ చేసి అడ్మిషన్ పొందేలా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే వినుకొండ, పిడుగురాళ్ల, సత్తెనపల్లిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని తెలిపారు. అవసరమైతే కళాశాల సిబ్బంది కూడా విద్యార్థులు ఇంటికి వెళ్లి నచ్చజెబుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంటర్మీడియట్ పాస్/ ఫెయిల్ అయిన విద్యార్థుల కొరకు వివిధ కోర్సులు నిర్వహిస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
డిజి లాకర్లో సర్టిఫికెట్లు...
ఇంటర్ పాస్ అయిన విద్యార్థుల కోసం డిజి లాకర్‌లో ఆన్‌లైన్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. 2014 నుండి 2023 మధ్య చదివిన విద్యార్థులు సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. షషష.సఱస్త్రఱశ్రీశీషసవతీ.స్త్రశీఙ్.ఱఅ నందు సర్టిఫికెట్ పొందవచ్చన్నారు.










