Mar 12,2023 00:41

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌

ప్రజాశక్తి-బాపట్ల : ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధి కారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాల యంలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్‌ వృత్తి విద్యాశాఖ అధికారి కె. ఆంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకూ ఇంటర్మీడియట్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 8,359 మంది జూనియర్‌, 10,474 సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు కలిపి మొత్తం 19,233 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 12 వరకూ పరీక్షలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమ తించరని పేర్కొన్నారు. 34 పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్‌ ప్రధాన కార్యాలయానికి అను సంధానం చేసినట్లు ఆయన తెలిపారు. జవాబు పత్రాలు భద్రపరిచేందుకు15 స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరేందుకు ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.. జె పంగులూరు, నూతనపాడు, వలపర్ల, నాగులపాలెం, బల్లికురవ, వేటపాలెం పరీక్ష కేంద్రాలకు బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 104 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. కళాశాలలకు ట్యూషన్‌ ఫీజు చెల్లించలేదని, హాజరు తక్కువగా ఉందని విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇవ్వకుండా నిరాకరిస్తే ఆయా కళాశాలల అనుమతులు రద్దు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులకు ఏదైనా సమస్య ఎదురైతే 9948661929 సెల్‌ నంబరులో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ. శ్రీనివాసులు, ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తదితరులు పాల్గొన్నారు.