ప్రజాశక్తి-పాడేరు:ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం మినీ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహణపై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని, విద్యార్ధులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాడేరు డివిజన్ పరిధిలో 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రధమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుండి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమై పోలీస్ భద్రత, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం, బల్లలు. ఏర్పాటు చేయాలని సూచించారు. మెరుగైన పారిశుద్ధ్యపు పనులు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధమ సంవత్సరంలో 3177, ద్వితీయ సంవత్సరం 2187 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. ఈ సమావేశంలో డిఐఇఓ ఎన్.బెన్న స్వామి, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు పి.వి.ఎన్.మూర్తి, బి.ఆర్. వేద వ్యాస్, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, పోస్టల్ సూపరింటెండెంట్ మురళి, ట్రాన్స్కో ఎడి ఇ.భాస్కరరావు పాల్గొన్నారు.
13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
కొయ్యూరు మండలంలో ఎపిటిడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల (బాలురు), అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల, అరకువ్యాలీ ఎపిటిడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల(బాలురు) అరకువ్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ముంచంగిపుట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెదబయలు ఎపిటిడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల (ఎస్టీ బాలురు), హకుంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాడేరు ఎపిటిడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల(బాలికలు), జి.మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాల, అప్పర్ సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, జి.కె.వీధి ఎపిడబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల (ఎస్టీ బాలికలు) కళాశాలలో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు.










