Jul 05,2023 00:04

ఇంటర్‌ నిర్వహణకు ఎంపికైన ప్రత్తిపాడు జెడ్‌పి పాఠశాల

ప్రజాశక్తి-గుంటూరు : ఎంపిక చేసిన హైస్కూల్స్‌లో బాలికల కోసం హైస్కూల్‌ ప్లస్‌ పేరుతో ఏర్పాటు చేసిన ఇంటర్‌ విద్యపై ప్రభుత్వం ఈ ఏడాది కూడా అశ్రద్ధ కనబరుస్తోంది. ఇంటర్‌ విద్యనైతే ప్రారంభించారు. వాటిల్లో విద్యార్థుల చేర్పింపు, ల్యాబ్‌లు, ఇతర మౌలిక వసతుల కల్పనను ప్రభుత్వం మరిచింది. కనీసం ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వలేదు. గతేడాది ఆలస్యంగా ప్రారంభం అయ్యాయని, వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ ప్రభావం ఫలితాలపె, ప్రస్తుత అడ్మిషన్లపై పడింది. ముఖ్యంగా కనీస వసతులు కానీ, ఉపాధ్యాయులకు తగిన శిక్షణ కానీ ఇవ్వలేదు.ఇదిలా ఉంటే ఉన్న వాటిని అభివృద్ధి చేయకుండా, మండలానికి రెండు కాలేజిలు ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం శోచనీయం. గత సంవత్సరం గుంటూరు జిల్లాలో 15 హైస్కూల్స్‌లో బాలికల కోసం ఇంటర్‌ విద్యను ప్రారంభించారు.ఎంపిసి, బైపిసి, సిఇసి కోర్సులను ప్రవేశపెట్టారు.
గతేడాది అన్ని కాలేజీల్లో కలిపి 201 మంది విద్యార్థులు మాత్రమే చేరారు. సాధారణ ఇంటర్‌ కాలేజిల అడ్మిషన్ల కంటే చాలా ఆలస్యంగా బాలికల కాలేజీలు ప్రారంభించారు. దీంతో టెన్త్‌ తప్పిన వారు, పై చదువులు మానేసిన వారు మాత్రమే నామమాత్రంగా చేరారు. ఈ ఏడాదైనా మార్పు వస్తుందనుకుంటే ఎలాంటి మార్పూ లేదు. ఈ సంవత్సరం కూడా ఇంటర్‌ ప్రధమ సంవత్సరంలో 216 మంది మాత్రమే చేరారు. వీరిలో ఎంపిసి గ్రూపులో 111 మంది, బైపిసిలో 94 మంది, సిఇసిలో 11 మంది చేరారు. కొన్ని పాఠాశాలల్లో మూడు, ఐదు వంటి సింగిల్‌ డిజిట్‌ అడ్మిషన్లు జరిగాయి. అంకిరెడ్డిపాలెం, కొల్లిపర హైస్కూల్స్‌ ఇంకా ఒకటిరెండు చోట్ల మాత్రమే అడ్మిషన్లు కొంచెం మెరుగ్గా ఉన్నాయి. అంకిరెడ్డిపాలెంలో 20 మంది, కొల్లిపరలో 15 మంది విద్యార్థినులు చేరారు. గత సంవత్సరం అడ్మిషన్లు లేని నారాకోడూరు, కొప్పర్రు జెడ్పీ హైస్కూల్స్‌కు ఈ ఏడాది అసలు ఉపాధ్యాయులనే కేటాయించలేదు. దీంతో ఆయా కాలేజిల్లో ఇంటర్‌లో ఒక్క విద్యార్థిని కూడా చేరలేదు.
మౌలిక సదుపాయాలేవి..
బాలికల కోసం ప్రత్యేకంగా ఇంటర్‌ విద్యను ప్రారంభించటంపై సర్వత్రా హర్షం వ్యక్తం అయ్యింది. అయితే వాటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేయటంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదనే విమర్శలు వస్తున్నాయి. గతేడాది అసలు ఉపాధ్యాయులనే నియమించలేదు. ఈ ఏడాది నియమించినా ఇంత వరకూ శిక్షణ ఇవ్వలేదు. ఇప్పటి దాకా హైస్కూల్‌ బోధన చేసిన వారితోనే ఇంటర్‌ పాఠాలు చెప్పిస్తున్నారు. ఇంటర్‌ పరీక్షలకు, హైస్కూల్‌ పరీక్షలకు వ్యత్యాసం ఉంటుంది. అనుభవం ఉన్న ఉపాధ్యాయులతో ఇంటర్‌ విద్యను బోధించాలి. కనీసం హైస్కూల్‌ ఉపాధ్యాయులకు తగిన శిక్షణ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు కాలేజిలు ప్రారంభించటానికి ముందుగానే ఉపాధ్యాయుల్ని నియమించి, వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉన్నా ఆ విధంగా చేయలేదు. అలాగే కనీసం ల్యాబ్స్‌ ఏర్పాటు చేయకపోవటంతో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ద్వితీయ సంవత్సరం నుండి ప్రాక్టికల్స్‌ చేయాల్సి ఉంటుంది. ప్రాక్టికల్స్‌కు ప్రత్యేకంగా మార్కులు కూడా కేటాయిస్తారు. కానీ ఒక్క హైస్కూల్లో కూడా ల్యాబ్స్‌ లేకపోవటంతో అయోమయంలో ఉన్నారు. కొన్ని చోట్ల సరైన తరగతి గదులు కూడా లేవు. కొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ విద్యపై నిర్లక్ష్యంపై అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయుల్లోనూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా తగిన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.