Feb 01,2023 23:04

ప్రజాశక్తి-విజయవాడఅర్బన్‌: విద్యతో పాటు క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని, ఈ దిశగా పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మెరుగైన క్రీడా వసతులు కల్పించామని రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యాభివద్ధి మరియు శిక్షణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సౌరబ్‌ గౌర్‌ అన్నారు. విజయవాడ ప్రభుత్వ కళాశాలలో రాష్ట్రస్థాయి 25వ ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే ఈ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌లో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలైన 13 జిల్లాల్లోని పాలిటెక్నిక్‌ కళాశాలలకు చెందిన 1600 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గోనున్నారని తెలిపారు. మూడు సంవత్సరాలుగా విద్య, సాంకేతిక విద్య, వృత్తి నైపుణ్యం శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం వల్ల నాణ్యతా ప్రమాణాలు పెరిగాయన్నారు. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఉపాధితో కూడిన విద్యా కోర్సులను ప్రవేశ పెట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుందని అయన అన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ సి.నాగరాణి మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు, శారీరిక దారుఢ్యానికి విద్యార్థులు క్రీడల్లో పాల్గొనాలన్నారు. మూడు రోజుల పాటు అన్ని జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతులు కల్పించామని ఆమె అన్నారు. విజయవాడ పాలిటెక్నిక్‌ కళాశాలలో నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ ను విజయవంతం చేయడానికి ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ముందుగా సౌరబ్‌ గౌర్‌, నాగరాణి, ఇతర అధికారులు క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం క్రీడాకారులకు క్రీడా జ్యోతిని అందించారు. క్రీడలు ప్రారంభ సూచికంగా పావురాళ్లను, బెలూన్‌లను ఎగురవేశారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు క్రీడా మార్చ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదో డివిజన్‌ కార్పొరేటర్‌ సిహెచ్‌.ఉషారాణి, సాంకేతిక విద్యా శాఖ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.