Mar 06,2023 21:20

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా జాయింట్‌ కలెక్టర్‌

ఇంటర్‌, ఎస్‌ఎస్‌సి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించండి
- జాయింట్‌ కలెక్టర్‌ టి.నిశాంతి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

       ఈ నెల 15 నుండి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 3 నుండి 18వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ టి. నిశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఇంటర్‌, 10వ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్‌ ప్రధమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 51 పరీక్షా కేంద్రాల్లో 26,970 మంది విద్యార్థులు, 10వ తరగతికి సంబంధించి 125 పరీక్షా కేంద్రాల్లో 25,411 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు కేటాయించిన విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్త్‌ ఏర్పాటు చేయాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌ ఏర్పాటు చేయాలని రెవిన్యూ అధికారులకు సూచించారు. కేంద్రాల వద్ద పారిశుధ్యంతోపాటు తాగునీటి వసతులు కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో అత్యవసర మందులతో ప్రథమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య అధికారులను ఆదేశించారు. పరీక్షా సమయాల్లో విద్యుత్‌ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులకు సూచించారు. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అనుకూలంగా అన్ని రూట్లలో ఆర్టీసి బస్సులు నడపాలని ఆర్‌టిసి అధికారులకు ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్‌ కేంద్రాలను మూసి వేసేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షలు ముగిసిన తర్వాత సమాధాన పత్రాలను పార్సిల్‌ ద్వారా డిస్పాచ్‌ చేసేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతించాలని పోస్టల్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి పుల్లయ్య, ఆర్‌ఐఒ గురువయ్య శెట్టి, డిఇఒ అనురాధ, డిఐఇఒ సునీత, మునిసిపల్‌ కమిషనర్‌ రవీంద్రారెడ్డి, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సిఇఒ సుబ్బారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.