కొత్త కొత్త ఎత్తుగడలతో
సరికొత్త ప్రణాళికల హంగులతో
పొంగుతున్న వర్ణ వివక్షత
ఆకలింపుకాని ధోరణి
పంజా విసిరినట్టు
గుట్టు చప్పుడు కాని వ్యవహారం
కాల నాగై బుసలు కొట్టింది
వివరణ లేని కార్యాలకు
ఆచరణ లేని మార్గాలకు
త్రోవలు ఏర్పరచుకుంటూనే
బతుకుపై ముళ్లు గుచ్చుతోంది
ఇంతకీ ఏమౌతోంది
స్వర్ణాక్షరాల లిఖిత పూర్వకాలన్నీ
లాభాపేక్ష భావాలై
వ్యవస్థను చుట్టుముట్టినాక
అంతర్గత నిర్మాణమే
నింగిని తాకి నిలబడింది
ఏదో ఒక సమస్యతో
పేపర్లు రెపరెపలాడుతుంటే
అసలు పని ఎలుగెత్తి
నినాదమై అడ్డంగా కూర్చుంది
గూడు చెదిరిన గుండె
ఒక్కసారిగా అదిరిపడినా
అక్కరకురాని చట్టం
నిక్కచ్చిగా చుట్టుకున్నా
కకావికలమైన సగటు దేహం
మన్నును ముద్దాడుతోంది
ఇంతకూ ఏమౌతోంది
ఏం జరిగిపోతోంది
రంగు రంగుల వస్త్రాల మధ్య
వర్గ వైషమ్యాల తాకిడి నడుమ
చిచ్చుల మనోభావాల రాపిడి మధ్య
మానవజాతి మనుగడ
ప్రశ్నార్థకంగా మారిపోతోంది
వివిధ వర్ణాల ఎజెండాలతో
ఎత్తుపల్లాల కుదుపులకు
మతి చెదిరే రాతల కోతలకు
మనిషి తత్వాన్ని మరిపించే
మాలిన్యపు మాటల ధోరణీలకు
సమాజం ఏమైపోతోంది
ఎటు పరుగెడుతోంది
నరెద్దుల రాజారెడ్డి
9666016636