Sep 26,2023 21:29

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మరథం బస్సు చోరీ

ఇంతకీ..బస్సు దొంగ ఎవరు..?
టిటిడి రవాణా శాఖ నిర్లక్ష్యం
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మరథం బస్సు చోరీ దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తుల నడుమ వేలాదిమంది భద్రతా సిబ్బంది మధ్య బస్సు మాయం కావడం అందరినీ ఆశ్చర్యం కలిగించే అంశం. టిటిడి రవాణా శాఖ నిర్లక్ష్యం పూర్తిస్థాయిలో ఉందని టిటిడిలో చర్చ నడుస్తోంది. అంత పెద్ద బస్సును ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తీసుకెళ్లాడంటేనే తిరుమల భద్రత ఏమాత్రం ఉందో చెప్పకనే చెప్పవచ్చు. నెలరోజుల క్రితం బ్యాటరీ బైక్‌ చోరీ జరిగినపుడే అప్రమత్తమై ఉండి ఉంటే బస్సు దొంగతనం చేయడానికి సాహసించేవారు కాదన్నది వాస్తవం.
తిరుమల తిరుపతి దేవస్థానం రవాణా శాఖ పరిధిలో 12 ధర్మరథాలు ఉన్నాయి. 500 పైగా కారులు ఉన్నాయి. లారీలు వంద పైనే ఉన్నాయి. 600మంది పైగా డ్రైవర్లు ఉన్నారు. ఇందుకోసం తిరుమల, తిరుపతిలో ప్రత్యేకించి గ్యారేజీలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు జిఎం స్థాయి అధికారి తిరుపతిలోనే ఉన్నారు. నెలరోజుల క్రితం ఓ బ్యాటరీ బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తి తస్కరించినట్లు తెలుస్తోంది. అయితే ఆ దొంగను పట్టుకున్నారా? లేదా? అన్నది ఇప్పటికీ తేల్చే పరిస్థితి లేదు. వారం రోజుల క్రితం బ్యాటరీ కారును ఓ వ్యక్తి తస్కరించి కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద ఛార్జింగ్‌ అయిపోవడంతో వదిలేసి వెళ్లిపోయాడు. అతనిని పట్టుకున్నామని, విచారించామని, పిచ్చోడని తేలడంతో వదిలేసినట్లు టిటిడి అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే ఇది నమ్మశక్యంగా లేదు. తాజాగా ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రికల్‌ ధర్మరథాన్ని తిరుమల నుంచి కిందకు తెచ్చి నాయుడుపేట సమీపంలోని బెదురువాడ టెక్నో ఇళ్ల వద్ద వదిలేసి వెళ్లాడు. ఛార్జింగ్‌ ఇంకా 75 కిలోమీటర్లు వెళ్లేలా ఉంది. దాదాపు మూడు నాలుగు గంటల తరువాత నిద్ర మేల్కొన్న టిటిడి యంత్రాంగం జిపిఎస్‌ ట్యాగ్‌ ద్వారా గుర్తించి పట్టుకున్నారు. బస్సు తస్కరించిన వ్యక్తి పోలీసులకు దొరికినట్లుగా సమాచారం. పూర్తిస్థాయిలో విచారించి వరుస చోరీల వెనుక ఉన్న ముఠాను రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
సెక్యూరిటీ వద్దనుకున్నారు
తిరుమల తిరుపతిలో ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ప్రైవేట్‌ సెక్యూరిటీని పెట్టి వాహనాల రాకపోకలను రిజిష్టర్‌లో నమోదు చేసి పంపించేవారు. అయితే వీరికి జీతాలివ్వాల్సి వస్తుందని, అనవసర ఖర్చని 'పిసినారితనంగా' వ్యవహరించింది. రెండేళ్ల క్రితం సెక్యూరిటీ వ్యవస్థనే తీసేసింది. ప్రస్తుతం సెక్యూరిటీ లేకపోవడంతో ఎవరికివారే యమునాతీరే అన్న చందంగా టిటిడి రవాణా శాఖ తయారయ్యింది. టిటిడి ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం వల్లనూ తిరుమల భద్రత గాలికొదిలేశారని చర్చ నడుస్తోంది.