
బయటకు వెళ్లి చేసేదే పని.. ఇంట్లో చేసేది పని కాదని చాలామందిలో జీర్ణించుకుపోయిన అభిప్రాయం. చేసిన పనికి ప్రతిఫలంగా చేతికి నాలుగు జీతం రాళ్లు అందితేనే అది విలువైన పని అని వారి నిర్ధారణ. కానీ, అది నిజం కాదు. జీతభత్యాలు లేకున్నా ఇంటా బయటా మహిళలు చేసే పని ఏమాత్రం తక్కువ కాదు. మరీ చెప్పాల్సి వస్తే - బయట పురుషులు ఉద్యోగులు చేసే జీతపు పని కన్నా- ఇంట్లో మహిళలు చేసే పని చాలా ఎక్కువ కూడా ! ఎంత ఎక్కువ అంటే - అది లెక్కకు అందనంత; ప్రతి పనికి వేతనం లెక్కేస్తే- గృహపతులు అనుకునేవాళ్లు చెల్లించలేనంత ! ఈ శ్రమకు విలువ గురించి ఇప్పుడు 'సుప్రీం' తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో ఇప్పుడు మరోసారి 'ఇంటిపని' అంశం మళ్లీ చర్చకు వచ్చింది. మహిళలు చేసే ఇంటి పనికి ఆర్థిక విలువ ఉండాలి అన్న సుప్రీం వ్యాఖ్యపై సర్వత్రా స్త్రీ లోకం సంతోషం వ్యక్తం చేస్తోంది. కానీ కొంతమంది ఇప్పటికీ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
కోడి కూయక ముందే నిద్రలేచి.. అందరూ పడుకున్నాకే పడుకుంటూ.. అన్నేసి గంటలు పనిచేసేది స్త్రీలు మాత్రమే. ఏ శ్రమకైనా పనిగంటలు ఉంటాయి. మహిళలు మాత్రం గడియారంతో పాటే ఉదయం లేచిన దగ్గర నుండి పొద్దెక్కే వరకూ చేస్తూనే ఉంటారు. ఆ శ్రమకు విలువ లేదు. ఇక ఉద్యోగినులకి ఇంటిపని అదనమే. స్త్రీ భాగస్వామ్యం కాని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. అంతరిక్షం నుండి వ్యవసాయకూలీ వరకూ చేస్తున్న ఆమె శ్రమకు గుర్తింపూ తక్కువే. ఇంకా ఆమె శ్రమపట్ల చులకన భావం. ఆమెనూ వస్తువుగానే చూసే ధోరణి.
విలువ కట్టగలమా ?
'ఆమె చేసే పనులకు రోజుకు ఎనిమిది గంటలు చేసే పనిలా ఎలా అంచనా వేస్తాం?' అని నిపుణులు అంటున్నారు. చాలామంది గృహిణి చేసే పనులకు విలువ ఇవ్వరు. 'ఇంట్లోనే ఉంటావు కదా.. నీకేం పనుంది?' అని తేలికగా అనేస్తారు. ఇంట్లో పని అంటే అది మహిళలదే అని భావిస్తూంటారు. కానీ ఒక ఇంట్లో మహిళ చేసే పని ఆగిపోతే ఇంటి చక్రం తిరగడమే ఆగిపోతుంది. ఇది ప్రతిఒక్కరూ నమ్మాల్సిన వాస్తవం. ఇప్పుడు సుప్రీం ఇచ్చిన తీర్పు మహిళల విషయంలో ఒక ఆలోచన రేకెత్తించే అంశం. ఇది మహిళలకు ఇచ్చే పరిహారం విషయమే మోగానీ.. గణనీయమైన మార్పు తెస్తుంది. ఇలాంటి మంచి తీర్పులు సుప్రీం కోర్టు వెలువరించడం అభినందనీయం. ఇల్లు నడవడంలో ఆమె తన శక్తిని, మనసునూ, సమయాన్నీ వెచ్చిస్తుంది. ఇంట్లో అందరూ సినిమా చూస్తున్నా.. ఎక్కడికైనా విహారానికి వెళ్లాలన్నా అందుకు ఆమె శ్రమ చేయాల్సే ఉంటుంది. ఆమె శ్రమకి ఇంట్లో వాళ్లు పుట్టినరోజులకు, పెళ్లిరోజులకు కానుకలిస్తున్నామంటే ఆమెను అగౌరవపరచినట్లే !
అంచనా ఎలా ?
సుప్రీం తీర్పు ఇచ్చిన కేసులో మహిళలు ఇంట్లో చేసే పనికి ఒక అంచనాతో విలువ కట్టారు. 'ఇంటి పనితీరును బట్టి గృహిణుల శ్రమకు తగ్గ విలువను లెక్కించే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీనివల్ల గృహిణుల పనిని, శ్రమను, త్యాగాలను గుర్తించినట్లు అవుతుంది. అందరికీ సమాన న్యాయం చేయాలనే జాతీయ, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, సామాజిక న్యాయంపై రాజ్యాంగ సూత్రాలను గుర్తించినట్లు అవుతుంది!' అని ఈ తీర్పులో పేర్కొన్నారు. 'ఒక మహిళ కుటుంబ జీవనశైలిని బట్టి ఆమె అర్హతలను పరిగణనలోకి తీసుకుని, కోర్టు ఆమె ఆదాయాన్ని అంచనాగా లెక్కిస్తుంది. దీనినే నోషనల్ ఆదాయం అని అంటారు. గతంలో ఒక కేసులోనూ ఈ ప్రస్తావన వచ్చింది. ఆయా పరిస్థితులకు అనుగుణంగా గృహిణి శ్రమకు తగ్గ విలువను ఊహించి, న్యాయస్థానం ఆమె ఆదాయాన్ని నిర్ణయించేందుకు రకరకాల పద్ధతులను ఉపయోగించు కోవచ్చు. గృహిణుల ఆదాయాన్ని ఊహించి నిర్ణయించేటప్పుడు కోర్టు వాస్తవ పరిస్థితులను, కేసుకు సంబంధించి నిర్దిష్ట అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. అంతేగానీ, మరీ సంకుచితంగానూ, మరీ ఉదారంగానూ వ్యవహరించకూడదు. భవిష్యత్తులో అటువంటి కేసుల్లో గృహిణుల ఆదాయాన్ని లెక్కిస్తే అది పరిహారంలో భాగంగా ఉండొచ్చు. అయితే, ఇది నిర్ణయించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఏమీ ఉండకూడదని, గృహిణి చేసే పనికి విలువ కల్పించడమే ఈ తీర్పు వెనకనున్న ఉద్దేశం' అని కోర్టు పేర్కొంది. ఇది సహేతుకమైనదే.
శ్రమకి తగ్గ వేతనం
'పురుషుల కంటే ఎన్నో రెట్లు మహిళలు ఇంటిపనులు చేస్తున్నారు!' అని జస్టిస్ ఎన్ వి రమణ చెప్పారు. ఆయన అన్నారని కాదు. ఇది ముమ్మాటికీ నిజం. 'కుటుంబానికి వండి పెట్టడం, ఇంటి నిర్వహణ, డబ్బుల జమ, ఖర్చుల బాధ్యత చూడడం, ఇంటికి అవసరమైన సరుకులు కొనడం, పిల్లలు, వృద్ధుల అవసరాలు చూడడం.. వంటి ఎన్నో పనులు చేస్తున్నారు' అని జస్టిస్ పేర్కొన్నారు. 'గ్రామాల్లో మహిళలు పొలం పనులు, పశుపోషణ బాధ్యతలూ నిర్వహిస్తారని ఆయన గుర్తు చేశారు. 'సామాజిక, సాంస్కృతిక తదితర కారణాల వల్ల వారు ఈ పనులు చేస్తున్నారు' అని జస్టిస్ ఎన్ వి రమణ చెప్పారు.
ఆధునిక పరికరాలున్నా శ్రమే !
ఆధునిక యుగంలో వంటింట్లోకి, ఇంట్లోకి కావాల్సిన అనేక పరికరాలు వచ్చేశాయి. కానీ, గృహిణి బాధ్యత మాత్రం రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది కానీ, ఏమాత్రం తగ్గటం లేదు. గృహిణులపై ఉండే శారీరక, మానసిక ఒత్తిడీ చాలా ఎక్కువవుతోంది. గృహిణికి ఆర్థిక స్వాతంత్య్రం రావాలంటే ఆమె చేసే పనికి కచ్చితంగా ఆర్థిక విలువ ఉండాలి. సాధారణంగా ఇంట్లో ఏ చిన్న తప్పు జరిగినా 'ఇంట్లోనే కదా ఉన్నావు, ఏమి చేస్తున్నావు చూసుకోకుండా!' అని చాలా సులభంగా అనేస్తారు. కానీ, ఇంటిపని అంత తేలికైన పని కాదనేది అనుభవపూర్వక వాస్తవం.. తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఒక స్త్రీ తన ప్రేమను, సమయాన్ని పూర్తిగా వెచ్చిస్తుంది. దానికి ఎంత డబ్బు ఇచ్చినా కొనలేరు. ఒక తల్లి ఇచ్చే మానసిక భద్రత మరెవ్వరూ ఇవ్వలేరు. దాన్నీ ధర పెట్టి మార్కెట్‌లో తెచ్చుకోలేం. ఆమెది కఠోరమైన శ్రమ. అవసరమైన సందర్భాల్లో విలువ ఇవ్వడం కాదు. ఆమె శ్రమ సమాజాభివృద్ధికీ తోడ్పడేదే. ఆ విషయం మరిచిపోకూడదు. ఆమె ప్రేమకి, బాధ్యతకి వెల కట్టడం ఏమిటని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నా.. ఆర్థిక విలువ స్త్రీ సాధికారతకు దోహదపడుతుంది.
వ్యవస్థ మార్పుతోనే..
చాలా మంది ఉద్యోగినులకూ ఆర్థిక స్వాతంత్య్రం ఉండదు. ఆమె ఎటిఎం కార్డూ అతనే ఉపయోగిస్తాడు. ఆమెకు బొట్టుబిళ్ల కావాలన్నా అతన్ని అడగాల్సిందే. 'ఆడవాళ్ల దగ్గర డబ్బులుండకూడదు, అతనే అందుకు సమర్థుడు!' అనే మాటలు మనకు నిత్యం వినిపించే మాటలు. దాదాపుగా ప్రతి ఇంట్లో ఆస్తులన్నీ పురుషుల పేరున.. పరువు ప్రతిష్టలను మోసే బాధ్యత మహిళలపైనే నెట్టేసే వ్యవస్థలో ఉన్నాం. ఈ వ్యవస్థ ఉన్నంతకాలం పరిస్థితులు మారవు. స్త్రీలపై ఆస్తులు ఉంచేవారు బహు అరుదు. వారిలోనూ ప్రభుత్వ పథకాల్లో లబ్ది పొందాలనే ఆలోచనతో పెట్టేవారే ఎక్కువ. ఈ తీర్పుపై ఇప్పుడైనా విస్తృతంగా చర్చ జరిగి, స్త్రీ ఆర్థిక స్వావలంబనకు తోడ్పడాలి.
పితృస్వామ్య భావజాలమే !
పితృస్వామ్య భావజాలం పురుషులకే కాదు.. మహిళల్లోనూ ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. అందులో భాగంగానే 'ఇంట్లో మహిళలు ప్రేమతో ఆప్యాయతతో చేసే పనికి ఖరీదు కట్టొద్దు!' అంటూ నటి కంగనా రనౌత్ ట్వీట్ చేశారు.
'మా చిన్న సామ్రాజ్యానికి రాణులుగా ఉన్నందుకు, మా సొంత బిడ్డలను పెంచుతున్నందుకు మాకు డబ్బులు చెల్లించకండి. ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడటం ఆపేయండి. మీ నుంచి ఆమె కోరుకునేది ప్రేమ, గౌరవం, డబ్బు మాత్రమే కాదు. మీరు పూర్తిగా ఆమెకే సొంతం కావాలనుకుంటుంది!' అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.ఇదంతా పితృస్వామ్య భావజాలమే. ఈ పితృ సమాజం గృహిణిని చూసే దృక్పథం మారాలి. మహిళలు ఎవరికి వారే తమకు ఆర్థిక లాభం అక్కరలేదు అనిపిస్తే దానికి ఏమి చెప్పలేం. కానీ, వారు చేసే పనులకు మాత్రం కొంత ఆర్థిక లాభం చేకూరితే వారికి ఆర్థిక స్థిరత్వం చేకూరినట్లే.

జస్టిస్ రమణ ఇచ్చిన తీర్పులో..

- గృహిణులకు నష్టపరిహారం చెల్లించడం న్యాయశాస్త్ర పరంగా సమ్మతమైన చర్య.
- లత వాద్వా, స్టేట్ ఆఫ్ బీహార్ మధ్య జరిగిన కేసులో ఒక ఉత్సవంలో తలెత్తిన అగ్ని ప్రమాదంలో మరణించిన గృహిణులకూ పరిహారం ఇవ్వాలి. ఇందులో గృహిణులకు పరిహారం ఇవ్వడానికి ఏడాదికి రూ.10,000 - 12,000 వార్షిక ఆదాయాన్ని లెక్కించారు.
- ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన ''టైం యూజ్ ఇన్ ఇండియా 2019'' నివేదికలో ఇంటిపనుల కోసం మహిళలు సగటున రోజుకు 299 నిమిషాలు వెచ్చిస్తే, పురుషులు మాత్రం 97 నిమిషాలు మాత్రమే వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది.
- ఆఖరికి 2001 జనాభా లెక్కలలోనూ ఇంటిపని చేసే వారిని అడుక్కునేవారు, వేశ్యలు, ఖైదీలతో పోలుస్తూ వారి పనికి ఆర్థిక విలువ లేనట్లుగా పరిగణించడం పట్ల కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా దేశంలో 36 కోట్ల మంది మహిళల పనిని ఆర్థికంగా విలువ లేని పనిగా అంచనా వేసింది.
- గృహిణులు చేసే పనికి విలువ లేకపోవడం ఒక్క భారతదేశానికే పరిమితం కాదు. ఇదే పరిస్థితి జర్మనీ, ఇటలీ, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలోనూ ఉందని ఇందులో ప్రస్తావించారు.
- ఒక నష్టపరిహారం కేసుకు సంబంధించి బెంచ్ ఇచ్చిన తీర్పుకు అదనంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీరమణ 'గృహిణులు చేసే పనికి ఎలాంటి ఆర్థిక విలువా లేదన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఒక గృహిణి చేసే పనులు కుటుంబ ఆర్థికవ్యవస్థకు, తద్వారా దేశ ఆర్థికవ్యవస్థకు దోహదం చేస్తాయి. గృహిణులు చేసే పనుల పట్ల న్యాయంగా వ్యవహరించాలనేది మనుషుల ఆలోచన దృక్పథంలో వస్తున్న మార్పులకు, అంతర్జాతీయ న్యాయ ప్రమాణాలను ప్రతిఫలింపజేసేలా ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 15.98 కోట్ల మంది మహిళలు ఇంటిపని చేస్తుండగా 57.9 లక్షల మంది పురుషులు మాత్రమే ఇంటిపని చేస్తున్నారు!'' అని తన అభిప్రాయాన్ని జత చేశారు. శాంతిశ్రీ
8333818985
స్పందనలు..

'మహిళలు చేసే పనికి వేతనం ఇవ్వాలి!' అంటూ తమిళనాడు రాష్ట్ర పభుత్వం పేర్కొనడం ఆహ్వానించదగినదే.
'గృహిణులకు వేతనం ఇవ్వాలి !' అంటూ సినీనటుడు కమల్‌హాసన్ తన ట్వీట్‌లో ప్రతిపాదిస్తూ 'అలా చేయడం వలన గృహిణుల పనిని గుర్తించి, ఆర్థిక విలువను చేకూరు స్తుంది!' అని కమల్ అన్నారు. 'దీనివలన వారికి స్వతంత్రం పెరిగి, అందరికీ కనీస ఆదాయం సంపాదించుకునే స్థితి వస్తుంది!' అని ట్వీట్లో పేర్కొన్నారు.
ఇదే గనుక ఆచరణాత్మకంగా జరిగితే గృహిణికి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించి, కచ్చితంగా స్త్రీ సాధికారతను కలుగజేస్తుంది.
లెనిన్ చూపిన ప్రత్యామ్నాయం..

'ఉద్యోగం పురుష లక్షణం మాత్రమే కాదు. మనిషి లక్షణం. ప్రతి మనిషికీ పని, పనికి తగ్గ వేతనం!' ఇదీ లెనిన్ నినాదం. 'స్త్రీలకు పని గ్యారంటీ చేయాలి. పురుషులతో సమానంగా వేతనం ఇవ్వాలి. మాతృత్వపు హక్కును గుర్తించాలి, గౌరవించాలి. పసి బిడ్డల ఆలనాపాలనా ప్రభుత్వానిదే బాధ్యత!' ఇదీ లెనిన్ భావన. అక్టోబరు మహా విప్లవం అదే ఆచరించి చూపింది. అదే విషయం కామ్రేడ్ కొల్లంతారు వివరిస్తూ.. 'ఈ విప్లవంలో మహిళల పాత్ర మహోజ్వలం. మహిళా నేతలతో పాటు బోల్షివిక్ పార్టీ, లెనిన్ నాయకత్వం మహిళా కార్మికుల ప్రత్యేక సమస్యలు గుర్తించారు. వారిని కార్మికోద్యమంలోను ఆ తర్వాత విప్లవోద్యమంలో భాగస్వాముల్ని చేశారు. చైతన్య రహితులుగా, చదువు లేక వెనకబడ్డ మహిళా కార్మికుల కోసం ప్రత్యేక మీటింగులు, క్లాసులు పెట్టి ప్రత్యేక బోధనా పద్ధతులతో వారిని చైతన్యపరిచారు. మహిళా కార్మికుల్లో అనేకమంది ఆ తరువాత నాయకులుగా ఎదిగారు. స్త్రీలు లక్షల సంఖ్యలో పోరాటాల్లోకి రావడం అనేది విప్లవోద్యమం జయప్రదం కావడానికి ఇంధనంలా పని చేసింది. ఆ బరువు బాధ్యతలను నాకు, కపస్కయా, ఇన్నెసా ఆర్మంటు వంటి మహిళా నేతలకు లెనిన్ అప్పగించారు!' అని వివరించారు.
'పట్టణ, గ్రామీణ ప్రాంతాల స్త్రీలు సోషలిస్టు సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఉద్యమానికి లెనిన్ శ్రీకారం చుట్టారు. లెనిన్ గొప్పతనమేమంటే ఇక్కడ పని కావాలని స్త్రీలు కోరకముందే సోవియట్ ప్రభుత్వం పని హక్కును గ్యారంటీ చేసింది. మహిళలు అనంతమైన ఇంటిపనుల్లో విసిగి వేసారిపోతున్నారనీ.. వారిని ఇంటి బయట సామాజిక శ్రమలో భాగస్వాముల్ని చేయాలనీ, స్త్రీలకు పని హక్కు గ్యారంటీ చేయాలనీ సోవియట్ ప్రభుత్వం పట్టుబట్టింది. అయితే అనంతమైన ఆ ఇంటిపనులు ఎవరు చెయ్యాలి? అనే ప్రశ్నకూ ప్రభుత్వం పరిష్కారం చూపింది. మాతృత్వాన్ని గౌరవించింది. ప్రసూతి, చిన్నారుల సంరక్షణ, విద్య, ఆరోగ్యానికి ప్రభుత్వం బాధ్యత వహించింది. ఇంటిపని తగ్గించడానికి సామూహిక వంటశాలలు, లాండ్రీలు ఏర్పడ్డాయి. పిల్లల సంరక్షణ కోసం కేర్ సెంటర్లు నడిపాం. అయితే అది అంత తేలికగా సాధ్యపడలేదు. పిల్లల్ని వదలడానికి సిద్ధపడని తల్లుల్ని ఒప్పించి, తల్లుల పనికి ఆటంకం లేకుండా పిల్లల కేంద్రాలు నడిపాం!' అని కొల్లంతారు పేర్కొన్నారు.
'గ్రామాల్లోనూ, పట్టణ మురికివాడల్లోనూ పేదరికంలో మగ్గిపోయి మూఢత్వంలో ఉన్న మహిళల్ని విద్యావంతుల్ని చేయడానికి, సోవియట్ నిర్మాణంలో భాగస్వాముల్ని చేయడానికి ప్రభుత్వం విప్లవానంతరం ఓ గొప్ప కార్యక్రమం చేపట్టింది. లెనిన్‌కు మహిళల శక్తి సామర్ధ్యాల పట్ల ప్రగాఢ విశ్వాసం. సోషలిస్టు సమాజ నిర్మాణంలో మహిళలు బాధ్యత తీసుకోవాలనీ, అయితే ఆ బాధ్యత వారి మాతృత్వ హక్కుకు శాపం కాకూడదని, వారి పిల్లల పెంపకాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించే బాధ్యత తీసుకొంటుందనీ హామీ ఇచ్చారు. పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కాదని, సమాజానికి పిల్లలే అమూల్యమైన సంపదని, పిల్లల బాధ్యత సమాజం బాధ్యత అని ఉద్ఘాటించారు!' అని ఆమె వివరించారు. 'ప్రపంచంలోని ఏ ఒక్క దేశంలోనూ మహిళల స్వేచ్ఛ, సమాన హక్కుల విషయంలో లెనిన్ వంటి గొప్ప ఆలోచనాపరుడు, రాజనీతిజ్ఞుడు లేనేలేడని చెప్పాలి. సోవియట్‌లో మహిళలు పొందిన సౌకర్యాలు అమెరికా వంటి అతి పెద్ద పెట్టుబడిదారీ దేశాలలో సహా ఏ ఒక్క దేశంలోనూ మహిళలు సాధించలేకపోయారు. ప్రపంచ దేశాల్లో మహిళా హక్కుల పోరాటాలకు, సోవియట్‌లో మహిళలు సాధించిన విషయాలు స్ఫూర్తిగా నిలిచాయి' అని కొల్లంతారు లెనిన్ మరణించాక ఆయనతో తాను కలిసి పని చేసినప్పటి అనుభవాలను పంచుకొన్నారు.
అనుజాత్ బొమ్మ.. బడ్జెట్ అట్టమీదకి..

అనుజాత్ది కేరళలోని త్రిసూర్. తను ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అనుజాత్ వాళ్ల నాన్నను ఎవరన్నా బయటివాళ్లు 'మీ ఆవిడ ఏం చేస్తుందీ?' అనడిగితే- 'ఆ .. ఏమీ లేదు.. ఇంట్లోనే.. ఖాళీగానే..' అనేవాడు. అనుజాత్‌కు అది కరెక్టు కాదనిపించేది. ఎందుకంటే- వాళ్లమ్మ ఎప్పుడూ ఇంట్లో ఖాళీగా ఉండదు. బోలెడు పనులు చేస్తోంది. అమ్మే కాదు; చుట్టుపక్కల అమ్మలందరూ అంతే! నిరంతరంగా ఇంటి కోసం, ఇంటిల్లిపాది కోసం ఏదొక పని చేస్తూనే ఉంటారు. అదే విషయాన్ని ఓ బొమ్మగా గీశాడు అనుజాత్. ఇదిగో.. 'మా అమ్మా, మా ఇరుగుపొరుగు అమ్మలూ..' అని దానికి పేరూ పెట్టాడు. మర్నాడు ఆ బొమ్మను స్కూల్లో టీచరు చూశారు. అనుజాత్ విశాల పరిశీలనను అభినందించారు. అంతేకాదు; ఆ బొమ్మను పైఅధికారులకు పంపారు. అధికారులు దానిని ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి దృష్టికి తెచ్చారు. ఆయన ఆ బొమ్మ ఉద్దేశాన్ని గమనించారు. మహిళలు తమ శ్రమ చేత తమ ఇళ్లనే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనూ నడిపిస్తారు అని చెప్పటం కోసం .. 2020 ఏడాది రాష్ట్ర జండర్ బడ్జెట్ పుస్తకానికి కవర్ పేజీగా ఆ బొమ్మనే ముద్రించారు. ఇప్పుడు అనుజాత్ వాళ్ల నాన్నను ఎవరన్నా 'మీ ఆవిడ ఏం చేస్తారు' అనడిగితే- మునుపటి సమాధానం చెప్పటం లేదు! అనుజాత్ తన బొమ్మకు అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు.

ఇంటి పనిలో... చెరి సగం..
ఆమె ఇంటెడు చాకిరీలో మగ్గిపోతోంది. అలిసిపోయి, ఆహ్లాదకరమైన నీలాకాశాన్ని ఆస్వాదిస్తూ చూడాలనుకున్నా, చూసే తీరిక లేని స్థితి ఆమెది. వేతనం లేని శ్రమ ఇంటిపని. ఉత్పత్తిలో ఆమె సగాన్ని మించిన భాగస్వామైనా.. ఇంటిపనిలో అతను మాత్రం భాగస్వామి కావడం లేదు. ఇప్పటికీ ఆమె శ్రమే ఎక్కువనేది సర్వేలు చెప్తున్నాయి. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో తీరు చూపే 'పట్టిక'లో అదే కనిపిస్తోంది. మన ఆంధ్రప్రదేశ్‌లో 18.2 శాతం, తెలంగాణాలో 20.8 శాతం పురుషులు ఇంటిపనిలో భాగస్వాములు అవుతున్నారు.