Oct 18,2023 18:48

జగనన్నకు చెబుదాంలోవినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-దత్తిరాజేరు :  జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు కృషి చేస్తామనిజిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లను పిలవడం జరిగిందని, ఖరారు కాగానే పనులు ప్రారంభిస్తామని అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం జరిగిన జెకెసి కార్యక్రమానిక కలెక్టర్‌ నాగలక్ష్మి హాజరై, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 69 అర్జీలు రాగా, వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 15, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖకు సంబంధించి 16, నీటిపారుదల శాఖకు 7, గ్రామ సచివాలయాలకు సంబంధించి 5, పంచాయితీరాజ్‌ శాఖకు 5, విద్యుత్‌ శాఖకు 4, మిగిలినవి ఇతర శాఖలకు సంబధించిన సమస్యలపై వినతుల అందాయి.
ఇంటింటికీ తాగునీరు సరఫరా చేయాలని, రోడ్లు, కాలువలు మంజూరు చేయాలని, శ్మశాన వాటికలకు రోడ్లు వేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని తదితర సమస్యలపై వినతులు ఎక్కువగా వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు.కార్యక్రమంలో కలెక్టర్‌ తోపాటు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, జెడ్‌పి సిఇఒ కె.రాజ్‌కుమార్‌, బొబ్బిలి ఆర్‌డిఒ శేషశైలజ, తాహశీల్దార్‌ రమేష్‌, ఎంపిడిఒ సుబ్రమణ్యం, ఇతర జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌కు డివైఎఫ్‌ఐ ఆధ్వర్యాన పలువురు వినతులు అందజేశారు. గడసాం, చినకాద మార్గమధ్యలో ఉన్న కొండ అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని, గతంలో స్పందనలో అందజేసిన దానిపై సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. గజపతినగరం-పోరలి గ్రామాల మధ్య బైపాస్‌ రోడ్డు మంజూరై నాలుగేళ్లయినా ఇప్పటివరకు 50 శాతం కూడా రోడ్డు పనులు జరగలేదని తెలిపారు. రోడ్డు పనులు మార్గాలలో ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో ప్రమాదాలు జరగుతున్నాయని తెలిపారు.