ప్రజాశక్తి వేటపాలెం: మండలంలో రేషన్ బియ్యాన్ని ఇంటింటికీ అందించాల్సిన బాధ్యత ఎండియు ఆపరేటర్లపై ఉంటుందని నూతన తహశీల్దారు యు అశోక్ వర్ధన్ అన్నారు. శనివారం ఆయన సాధారణ బదిలీలలో భాగంగా వేటపాలెం మండల తహశీల్దారుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అశోక్‌వర్ధన్ మాట్లాడుతూ చట్టపరిధికి లోబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ విషయాన్ని గమనించి మండల ప్రజానీకం నేరుగా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఎండియు ఆపరేటర్లు బజారులలో ఓ మూలన వ్యాన్ పెట్టి లబ్ధిదారులకు అందిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజలకు ఇంటింటికీ రేషన్ బియ్యాన్ని అందించాల్సిన బాధ్యతను గుర్తెరగాలన్నారు. కింది స్థాయి సిబ్బంది పనులు ఏమైనా పెండింగ్ పెడితే తన దృష్టికి తీసుకొని వస్తే వెంటనే సామరస్యంగా పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజల సమస్యలను ఆకలింపు చేసుకొని చట్ట పరిధిలో తక్షణ పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. సంతమాగులూరు నుంచి బదిలీపై వేటపాలెం వచ్చినట్లు ఈ సందర్భంగా అశోక్ వర్ధన్ తెలిపారు. ఉదయం సంతమాగులూరులో రిలీవ్ అయ్యి వెంటనే వేటపాలేనికి వచ్చి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల డిప్యూటీ తహశీల్దారు జి మహేశ్వరి, సర్వేయర్ సాయికృష్ణ, యుడిసి రమణ, జూనియర్ అసిస్టెంట్ ఎం జగదీష్, ఆర్‌ఐ సత్యం, వీఆర్వోలు ఫక్రుద్దీన్, మునీర్‌లు నూతన తహశీల్దారును కలిసి పుష్పగుచ్ఛాలు అందించి పరిచయం చేసుకున్నారు.










