
ప్రజాశక్తి - చాగల్లు, ఉండ్రాజవరం రాష్ట్రంలోని ఇంటింటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. చాగల్లులోని సచివాలయం-2 పరిధిలో గురువారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకున్న సమస్యలను ప్రజలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు, డ్రైయిన్ల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. అర్హత ఉండి ఏ సంక్షేమ పథకం అందకపోయిన తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని అన్నారు. ప్రజల వద్దకు వెళ్తుంటే జగనన్న పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గాన్నిఅన్ని విధాలుగా అభివద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా చాగల్లులోని జడ్‌పి ఉన్నత పాఠశాల బాలికల జూనియర్ కళాశాలను ఆమె తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలం కె.సావరంలో గురువారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస్ నాయుడు పాల్గొని ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి నందిగం భాస్కర రామయ్య, పిఎసిఎస్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావు, మండల జెసిఎస్ ఇన్‌ఛార్జ్ కఠారి సిద్ధార్థ రాజు, బసవా రమణారావు, మీసాల సురేష్, వర్రే రమేష్ , రామాయణం శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ఎండి హసన్ జానీ, పాల్గొన్నారు.