
ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సర్వే వంద శాతం పూర్తి అయిందని జిల్లా జాయింట్ కలెక్టర్, నియోజక వర్గ ఎన్నికల అధికారి చేతన్ అన్నారు. స్పెషల్ సమ్మరి రివిజన్ - 2024లో భాగంగా నియోజవర్గ వ్యాప్తంగా ఉన్న అధికారులతో స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు నియోజక వర్గ వ్యాప్తంగా నూతన ఓటరు నమోదుతో పాటు చేర్పులు...మార్పులపై వచ్చిన ధరఖాస్తులను బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి పరిశీలన చేసే కార్యక్రమం వంద శాతం పూర్తి అయిందన్నారు. వారి దృష్టికి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో జనవరి 6, 2022 తేదీ నుంచి ఆగస్టు 9, 2023వ తేదీ వరకు వచ్చిన డెత్, షిఫ్టింగ్ కేసులు అన్ని రీవెరిఫికేషన్ చేయడం జరుగుతోందని, రీవెరిఫికేషన్ పై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు అవగాహన పెంచుకోవాలని అన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లకు ఈ విషయమై అవగాహన కల్పించాలని సూచించారు. రీ వెరిఫికేషన్ కోసం మండలనికి ఒక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించడం జరిగిందని. వారు నియోజకవర్గంలో 500 కేసులను పరిశీలన చేయడం జరిగిందని అన్నారు. అనర్హత కలిగిన ఓటర్ల తొలగింపు విషయమై ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ విషయాలతో పాటు ఇతర విషయాల గురించి వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి వివరించారు. ఈ కార్యక్రమాల్లో తహశీల్దార్లు హసీనా సుల్తాన, నాగరాజు, ఎంపిడిఒ నరేంద్ర కుమార్, ఇతర అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.