Sep 25,2023 21:09

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

ప్రజాశక్తి - రాయచోటి : జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత ఇంటింటి సర్వే వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ సంబంధత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష, వాహనమిత్ర, జగనన్నతోడు ఇకెవైసి, తదితర అంశాలపై కలెక్టర్‌ గిరీష పిఎస్‌, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు .ఈనెల 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తారని, ఇందుకు సంబంధించి వాలంటీర్లు రెండో విడత ఇంటింటి సర్వే వంద శాతం తప్పక పూర్తి చేయాలన్నారు. సచివాలయ ఆరోగ్యకార్యకర్తలు, ఎమ్‌ఎల్‌హెచ్‌పిలు, ఆశా కార్యకర్తలు వాలంటీర్ల సహకారంతో ఇంటి ఇంటి సర్వే నిర్వహించి జగనన్న ఆరోగ్య సురక్ష టోకెన్‌లు తప్పనిసరిగా పంపిణీ చేయాలన్నారు. ఇంటింటి సర్వేలో సాధారణ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణీలు, బాలింతలు తగిన బరువు లేని పిల్లలను గుర్తించి వైద్య శిబిరానికి తరలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఆరోగ్య శిబిరంలో ఇద్దరు వైద్యాధికారులు, ఇద్దరు స్పెషలిస్ట్‌ డాక్టర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా అందించే వైద్య సేవలపై ప్రజల్లో విస్తత ప్రచారం కల్పించాలన్నారు. వైద్యం కోసం ప్రజలు ప్రయివేట్‌ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వాసుపత్రులకు వెళ్లే విధంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సంబంధించి వైద్యులు, సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇకెవైసి చేయించకపోతే తర్వాత లబ్ధిదారులు ఆ పథకాలకు అనర్హులవుతారన్నారు. లబ్ధిపొందిన వారందరి నుంచి ఇకెవైసి తప్పక చేయించాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, హౌసింగ్‌ పీడీ శివయ్య, డ్వామా పీడీ మద్దిలేటి, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.