* జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాఠకర్
ప్రజాశక్తి - శ్రీకాకుళం: జిల్లాలో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితా-2024 ఇంటింటి సర్వే శత శాతం పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో 97.31 శాతం పూర్తయిందని, త్వరలో శతశాతం పూర్తి కానుందని వివరించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్‌ఒలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాలకు సంబంధించిన తొలగింపులు, చేర్పుల ఓటర్ల జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పరిశీలించారు. వీటిపై ఎటువంటి అభ్యంతరాలు తెలియజేయకపోవడంతో, మిగిలిన నియోజకవర్గాలకు చెందిన జాబితాల్లో ఏమైనా సందేహాలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. బిఎల్‌ఒలు కొత్తగా నమోదు చేసిన, తొలగించిన ఓటర్లకు సంబంధించిన డాక్యుమెంటేషన్ పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి పొరపాట్లు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. సక్రమంగా డాక్యుమెంటేషన్ చేయని కంచిలి మండలం కోనాడ బిఎల్‌ఒను సస్పెన్షన్ చేయాలని, సంతబొమ్మాళి మండలం కొల్లిపాడులోని ఓటరుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ సరిగా లేనందున బిఎల్‌ఒకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి పి.మురళీకృష్ణ, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్‌ఒలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.










