ప్రజాశక్తి -సీతానగరం : మండలంలోని లక్ష్మీపురం గ్రామ సచివాలయ పరిధిలో గల గ్రామంలో జ్వరాలపై ఇంటింటి సర్వేను పరిశీలించిన మలేరియా జిల్లా అధికారి శ్యామ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్యం నీటి నిల్వలు, కాలువలను, పూడికతీతలు చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై సర్వేలు నిర్వహణను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో ఎఎంఒ సూర్యనారాయణ, హెచ్‌ఎస్ గోపాలరావు, ఎంఎల్‌ఎంఎల్ హెచ్‌పి కె.హరిప్రియ, హెల్త్ అసిస్టెంట్ కె.వెంకటేష్, ఎఎన్‌ఎం బి.రమాదేవి ఆశా కార్యకర్త టి రమాదేవి పాల్గొన్నారు.
జ్వరాలపై అప్రమత్తంకండి
సీతంపేట : ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలపై వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎంపిడిఒ కొండపల్లి సత్యం అన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం గ్రామాల్లో నిర్వహించాలన్నారు. జ్వరాలు రాకుండా చూడాలని చెప్పారు. సిబ్బంది ద్వారా సమాచారం తీసుకొని గ్రామాల్లో వైద్య సేవలు రోగులకు సకాలంలో అందించాలన్నారు. ఈ సందర్భంగా వైద్యులు సూచనలు, సలహాలు ఇచ్చారు. వైద్యాధికారులు రవీంద్ర కుమార్, సాయి చరణ్, భాను ప్రతాప్, సత్యవేణి, చాందిని తదితరులు పాల్గొన్నారు.
వ్యాధులపై అప్రమత్తం
వీరఘట్టం : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, వీటిని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని ఎంపిడిఒ జిజె ప్రసాద్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వైద్య, పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఇళ్లకు వెళ్లి ఫీవర్ సర్వే చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే క్లోరినేషన్, ఫాగింగ్ విధిగా చేయాలన్నారు. గ్రామాల్లో గర్భిణీలకు స్టేజిలు వారీగా పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. విటమిన్లపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఫీవర్ సర్వే వివరాలు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. డెంగీ, మలేరియా వ్యాధులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో వీరఘట్టం, బిటివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు పి.ఉమామహేశ్వరి, నితీష, ఇఒపిఆర్‌డి వి.రామచంద్రరావు, సచివాలయ కార్యదర్శులు, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.










