Jul 22,2023 23:13

మాట్లాడుతున్న టిడిపి జిల్లా అధ్యక్షులు రవికుమార్‌

- టిడిపి జిల్లా అధ్యక్షులు రవికుమార్‌
ప్రజాశక్తి - పొందూరు: 
ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగంగా చేపడుతున్న ఇంటింటా సర్వేలో అధికార పార్టీ అక్రమాలను అడ్డుకునేందుకు టిడిపి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ అన్నారు. స్థానిక కళ్యాణ మండపంలో టిడిపి బూత్‌ కన్వీనర్లతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ ఓట్ల అక్రమాలపై ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఇంటింటా సర్వేను చేపడుతున్నారని చెప్పారు. ఈ సర్వేలో వాలంటీర్లు పాల్గొంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలన్నారు. ఇంటింటికీ తిరుగుతూ టిడిపి సానుభూతిపరుల ఓట్ల తొలగింపు పరిశీలన, అధికార పార్టీ అక్రమ ఓట్ల నమోదు వంటి వాటిని నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఇంటింటా సర్వేకు సంబంధించిన సమాచారాన్ని టిడిపి బూత్‌ కన్వీనర్లు తమ వద్ద ఉంచుకుని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలన్నారు. వైసిపి నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అక్రమంగా ఓట్ల నమోదుకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. సమావేశంలో టిడిపి మండల అధ్యక్షుడు చిగిలిపల్లి రామ్మోహన్‌, జిల్లా కార్యదర్శి సీపాన శ్రీరంగనాయకులు, పిఎసిఎస్‌ మాజీ అధ్యక్షులు కూన వెంకటసత్యనారాయణ, బిసి సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు చింతాడ కృష్ణవాసుదేవరావు, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి బలగ శంకరభాస్కరరావు, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు గాడు నారాయణరావు, టిడిపి పట్టణ అధ్యక్షు, ప్రధాన కార్యదర్శి అనకాపల్లి శ్రీరంగ, వండాన మురళి తదితరులు పాల్గొన్నారు.