Jan 28,2023 22:11

అందని కాంట్రాక్టు కార్మికుల, స్వీపర్ల జీతాలు, అలవెన్సులు
రూ.ఐదు కోట్లకు పైగా బకాయిలు
నోరుమెదపని పాలకులు
వచ్చేనెల 3 నుంచి నిరవధిక సమ్మెకు కార్మికులు సమాయత్తం
ఏలూరు కార్పొరేషన్‌ తీరుపై సర్వత్రా విమర్శలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

                 ఏలూరు కార్పొరేషన్‌ వ్యవహారశైలి గత కొంతకాలంగా వివాదాస్పదమవుతోంది. ఒక్కపక్క అవినీతి కుంభకోణాలు బయటపడుతుండగా, మరోపక్క జీతాల్లేక ఆకలి మంటలతో కాంట్రాక్టు కార్మికులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. చిరుద్యోగులకు జీతాలు, అలవెన్సులు చెల్లించకుండా కోట్లాది రూపాయల బకాయిలున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌ ఏడు గ్రామాల విలీనం తర్వాత సుమారు 3.50 లక్షల జనాభాకు చేరింది. మొత్తం 50 డివిజన్‌లు ఉన్నాయి. నిత్యం నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎనలేనిది. అలాంటి కార్మికుల పట్ల కార్పొరేషన్‌ పాలకవర్గం, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడాలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. కార్మికుల జీతాలు, హెల్త్‌ అలవెన్సులు, పిఆర్‌సి ఎరియర్స్‌ సకాలంలో ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. 430 మంది విలీన పంచాయతీ కార్మికులకు రావాల్సిన తొమ్మిది నెలల హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు రూ.రెండు కోట్ల 32 లక్షల 20 వేలు నిలిచిపోయాయి. వీరికి రావాల్సిన గత ఏడాది జూన్‌ నెల జీతం రూ.64.50 లక్షలు ఇప్పటికీ అందలేదు. 370 మంది పారిశుధ్య కార్మికులకు రావాల్సిన ఆరు నెలల హెల్త్‌ అలవెన్స్‌ల బకాయి రూ.కోటీ 33 లక్షల 20 వేలు పేరుకుపోయాయి. 150 మంది ఇంజినీరింగ్‌ విభాగం కార్మికుల పదో పిఆర్‌సి ఏరియర్స్‌ రూ.64.20 లక్షలు ఇవ్వలేదు. 60 మంది స్కూల్‌ స్వీపర్ల నాలుగు నెలల జీతం రూ.9.60 లక్షలు కూడా నిలిచిపోయాయి. ఏలూరు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు రావాల్సి పెండింగ్‌ బకాయిలు రూ.5,03,70,00 ఉందంటే పరిస్థితి ఏమిటో అర్ధంచేసుకోవచ్చు. కార్పొరేషన్‌కు ప్రతిఏటా రూ.కోట్లలో ఆదాయం వస్తున్నప్పటికీ కార్మికులకు జీతాలివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయిల్‌ కుంభకోణం, ఉద్యోగ నియామకాల్లో అవినీతి, వాహనాల మాయం వంటి అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
కార్మికుల జీతాలు, అలవెన్స్‌లకు సంబంధించి కమిషనర్‌, మేయర్‌, కలెక్టర్‌, ఎంఎల్‌ఎలను కలిసి మొరపెట్టుకున్నా వారి గోడు ఎవరూ వినడం లేదు. కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటే వైద్యం చేయించుకునే ఇఎస్‌ఐ కార్డులు సైతం ఏడాదింగా ఇవ్వడం లేదు. పిఎఫ్‌ స్లిప్పులు కూడా ఇవ్వడం లేదు. తమగోడు పట్టని పాలకుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వచ్చేనెల మూడోతేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని కార్మికులు నిర్ణయించారు. సిఐటియు అనుబంధమైన ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగనుంది. కార్పొరేషన్‌ పాలకులు, అధికారులు చిరుద్యోగులపై కనికరం చూపి వెంటనే వారి సమస్యలు పరిష్కరిస్తే ఉపయోగకరం. లేనిపక్షంలో ఏలూరు కార్పొరేషన్‌ తీరు మరోసారి వివాదస్పదమయ్యే పరిస్థితులు ఏర్పడనున్నాయి
కార్మికుల బకాయిలివే..
430 మంది విలీన పంచాయతీ కార్మికుల హెల్త్‌ అవెన్స్‌లు - రూ.2,32,20,000
430 మంది కొత్తవారికి రావాల్సిన గత ఏడాది జూన్‌ జీతం - రూ.64,50,000
370 మంది పాత పారిశుధ్య కార్మికుల ఆరు నెలల హెల్త్‌ అలవెన్సులు - రూ.1,33,20,000
150 మంది ఇంజినీరింగ్‌ విభాగం కార్మికుల పదో పిఆర్‌సి ఎరియర్స్‌ బకాయిలు - రూ.64,20,000
60 మంది స్కూలు స్వీపర్ల నాలుగు నెలల జీతాలు - రూ. 9,60,000
మొత్తం కార్మికులకు రావాల్సిన బకాయిలు రూ.5,03,70,000